Reliance Retail | కొత్త వ్యాపారంలోకి రిలయన్స్ రిటైల్ కంపెనీ.. అదేంటంటే..!
Reliance Retail | రిలయన్స్ రిటైల్ కంపెనీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కొత్తగా క్విక్ కామర్స్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం 30-45 నిమిషాల్లో వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబై, నవీ ముంబైలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.

Reliance Retail : రిలయన్స్ రిటైల్ కంపెనీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కొత్తగా క్విక్ కామర్స్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం 30-45 నిమిషాల్లో వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబై, నవీ ముంబైలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్ రిటైల్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్‌లో ‘హైపర్‌లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని తెలిపింది. అందుకు రిలయన్స్ జియోమార్ట్ పార్ట్‌నర్స్ చొరవ కీలకమని చెప్పింది. టాటా యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. లాంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ రిటైల్ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది.
ఈ అంశంపై స్పందిస్తూ.. ‘ప్రస్తుతం మార్కెట్‌లో క్విక్ కామర్స్ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్‌ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా రిలయన్స్ జియోమార్ట్ పార్ట్‌నర్స్‌ను రిటైల్ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్ (FYND), లోకస్ (Locus) లాంటి సాంకేతిక ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.
గత ఏడాది రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నవీ ముంబైలో క్విక్ కామర్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్‌లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.