Loan Rejection : మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ ఎందుకు రాదు?

క్రెడిట్ స్కోర్ బాగున్నా లోన్ రాకపోవడానికి ఆదాయం అస్థిరం, అధిక అప్పులు, క్రెడిట్ హిస్టరీ తక్కువ, డాక్యుమెంటేషన్ లోపాలు వంటి కారణాలు ముఖ్యమని బ్యాంకులు చెబుతున్నాయి.

Loan Rejection : మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ ఎందుకు రాదు?

మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా కొందరికి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు రుణాలు ఇవ్వవు. అసలు దీనికి కారణం ఏంటి? లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకర్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? ఏ అంశాలు రుణం విషయంలో ప్రభావం చూపుతాయి?

బ్యాంకర్లు ఏ అంశాలు చూస్తారు?

సాధారణంగా క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉంటే రుణం రాదని బ్యాంకర్లు చెబుతారు. క్రెడిట్ స్కోర్ 750 దాటితే మెరుగైన క్రెడిట్ స్కోర్ గా భావిస్తారు. అంటే మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా కొందరికి లోన్లు ఇవ్వరు. క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్నా రుణం తీసుకునే వ్యక్తికి స్థిరమైన ఆదాయం ఉందా? లేదా అని పరిశీలిస్తారు? ఒకవేళ స్థిరమైన ఆదాయం లేకపోతే లోన్ ఇవ్వరు. అంతేకాదు ఇంకా ఏమైనా అప్పులున్నాయా? ఆర్ధిక క్రమశిక్షణను కూడా పరిశీలిస్తారు. తరచూ ఉద్యోగాలు మారడం… అస్ధిరమైన వేతనం వంటి అంశాలు కూడా లోన్ ఇవ్వకుండా ఉండేందుకు కారణం అవుతాయి.

లోన్ తిరస్కరణకు ప్రధాన కారణాలు

స్థిరమైన ఆదాయం లేకపోయినా, ఉద్యోగంలో గ్యాప్ వస్తే రుణం చెల్లించే సామర్థ్యంపై బ్యాంకులకు సందేహం కలుగుతుంది. అంతేకాదు మీకు వచ్చే జీతంలో పెద్ద మొత్తం అప్పుల చెల్లింపులకు ఖర్చు చేస్తుంటే మిమ్ములను అప్పులపై ఆధారపడిన వారిగా భావిస్తారు. ఒకటికి మించి క్రెడిట్ కార్డులకు ధరఖాస్తు చేస్తే ఆర్ధిక ఒత్తిడిలో ఉన్నట్టుగా బ్యాంకులు భావించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు, ఈఎంఐ చెల్లింపుల్లో ఆలస్యం లేదా చెల్లించకపోతే కూడా లోన్ ఇవ్వకపోవచ్చు. ఎవరైనా లోన్ తీసుకొని చెల్లించకపోతే అతడికి మీరు పూచీకత్తుగా ఉంటే కూడా లోన్ తిరస్కరించే అవకాశం ఉంది.

ఆదాయం, రుణ ఆదాయ నిష్పత్తి

మీ ఆదాయం తక్కువగా ఉంటే లేదా మీ ఆదాయంతో పోలిస్తే ఇప్పటికే ఉన్న అప్పులు ఎక్కువగా ఉంటే రుణ దాతలు లేదా బ్యాంకర్లు అప్పు ఇవ్వడానికి వెనుకంజ వేయవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా అప్పుల కోసం ధరఖాస్తులు చేసినా కూడా మీకు లోన్ ఇచ్చే అవకాశాలు తక్కువ. మరో వైపు రుణం తీసుకొనే వ్యక్తి వయస్సు కూడా రుణం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నవారికి రుణాలు ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపవు ఆర్ధిక సంస్థలు. యువకులు, లేదా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి లోన్లు ఇస్తారు. ఎందుకంటే వారికి ఉద్యోగం చేసి అప్పు తీరుస్తారనే నమ్మకం. ఆదాయానికి మించి రుణం కోసం ధరఖాస్తు చేసినా కూడా ఆ రుణాలు మంజూరు చేయరు. క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉండడం కూడా రుణం ఇవ్వకపోవడానికి కారణంగా ఉంటుంది. తక్కువ క్రెడిట్ హిస్టరీ ఉంటే మీరు రుణం తీసుకొని చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని బ్యాంకులు అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డులు రద్దు చేసుకొనే విషయంలో ఆలోచించాలి. పాత క్రెడిట్ కార్డులను రద్దు చేసుకొంటే క్రెడిట్ హిస్టరీ అంతా పోతుంది.

డాక్యుమెంటేషన్‌లో లోపాలు

పాన్ వివరాలు తప్పుగా ఇచ్చినా… సంతకాలు సరిపోకపోయినా.. సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోతే రుణం మంజూరులో ఆలస్యం కావచ్చు. లేదా రుణమే ఇవ్వకపోవచ్చు. సుదీర్ఘ ఉద్యోగ చరిత్ర ఉన్నకంపెనీలను బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఇష్టపడతాయి. ఆ కంపెనీలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సులభంగా రుణాలు అందిస్తాయి.