Star Heroes | 2026లో టాలీవుడ్‌కు డబుల్ పంచ్‌.. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో స్టార్ హీరోల సందడి

Star Heroes | 2025 సంవత్సరం టాలీవుడ్‌కు కాస్త నిశ్శబ్దంగానే గడిచింది. దాదాపు అంద‌రు స్టార్ హీరోలు కొత్త చిత్రాల షూటింగ్‌లు, భారీ ప్రాజెక్టుల తయారీతో బిజీగా ఉండటంతో ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో సినిమాలు అందలేదు. అయితే ఆ లోటును భర్తీ చేస్తూ 2026లో మాత్రం థియేటర్లలో అసలైన పండుగ వాతావరణం నెలకొనబోతోంది.

  • By: sn |    movies |    Published on : Jan 04, 2026 4:09 PM IST
Star Heroes |  2026లో టాలీవుడ్‌కు డబుల్ పంచ్‌.. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో స్టార్ హీరోల సందడి

Star Heroes | 2025 సంవత్సరం టాలీవుడ్‌కు కాస్త నిశ్శబ్దంగానే గడిచింది. దాదాపు అంద‌రు స్టార్ హీరోలు కొత్త చిత్రాల షూటింగ్‌లు, భారీ ప్రాజెక్టుల తయారీతో బిజీగా ఉండటంతో ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో సినిమాలు అందలేదు. అయితే ఆ లోటును భర్తీ చేస్తూ 2026లో మాత్రం థియేటర్లలో అసలైన పండుగ వాతావరణం నెలకొనబోతోంది. టాలీవుడ్ టాప్ హీరోలంతా వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ హీట్ భారీగా ఉండనుంది.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ ఎత్తున విడుదల కానుంది. రీజనల్ సినిమాగా ప్రారంభమైన ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరడంతో ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? దీర్ఘకాలంలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందా? అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో ఊపందుకుంది.

ఇదే కాకుండా ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో యుద్ధ నేపథ్యంతో పాటు హృదయాన్ని తాకే ప్రేమకథను చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ‘రాజాసాబ్’ తర్వాత కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే ప్రభాస్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా 2026ను ప్రత్యేకంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘విశ్వంభర’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. సోషల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని కూడా ఈ ఏడాది వరుస సినిమాలతో రాబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ మార్చిలో గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రం కూడా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఏడాది డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ షూటింగ్ దశలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలున్నాయి. దీనితో పాటు ‘దృశ్యం 3’ను కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని వెంకీ భావిస్తున్నారు. మలయాళంలో ‘దృశ్యం 3’ కూడా ఇదే సమయంలో విడుదల కానుండటంతో తెలుగు వెర్షన్‌ను ఆలస్యం చేసే అవకాశం లేదని సమాచారం.

మొత్తానికి 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల హవా స్పష్టంగా కనిపించనుంది. వరుస రిలీజ్‌లు, భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి సినిమా విందు అందనున్నది.