“కూలీ” సమీక్ష – రజినీకాంత్ స్టైల్, నాగార్జున విలనిజం, లోకేష్ మాస్ ట్రీట్‌ – ఎలా ఉంది?

రజినీకాంత్–నాగార్జున జోడీతో లోకేష్ కనగరాజ్ మాస్ యాక్షన్ పండుగ. స్టైల్, యాక్షన్, అతిథి పాత్రలు ఆకట్టుకున్నా కథనం కొంత మేరకు బలహీనమే.

“కూలీ” సమీక్ష – రజినీకాంత్ స్టైల్, నాగార్జున విలనిజం, లోకేష్ మాస్ ట్రీట్‌ – ఎలా ఉంది?

Coolie Review | సూపర్‌స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన “కూలీ” ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన థియేటర్లలో సందడి చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో “మాస్ సునామీ”గా ట్రెండ్ అయిన ఈ చిత్రం, రికార్డు స్థాయి ప్రీ-సేల్స్‌తో, విడుదల రోజే 12 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

కథ

దేవా (రజినీకాంత్) – ‘దేవా మాన్షన్’ అనే హాస్టల్ యజమాని, విద్యార్థులకు తక్కువ అద్దెకు సౌకర్యాలు కల్పిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఇంతలో అతని ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) ఆకస్మిక మరణం వెనుక దాగి ఉన్న హత్య రహస్యం బయటపడుతుంది. నిజాన్ని వెలికితీయడానికి దేవా విశాఖపట్నం పోర్టులో అక్రమ స్మగ్లింగ్ నడిపే సైమన్ (నాగార్జున), అతని సహచరుడు దయాల్ (సౌబిన్ షాహిర్)లతో తలపడతాడు. ఈ మిషన్‌లో దేవా గతజీవిత రహస్యాలు, పూర్తిచేయలేకపోయిన పనులు మళ్లీ అతని ముందు ప్రత్యక్షమవుతాయి. ఈ మాస్ రివెంజ్ డ్రామా, దేవా వ్యక్తిగత పోరాటం, స్నేహబంధం, న్యాయం కోసం సాగించే యుద్ధం చుట్టూ తిరుగుతుంది.

నటన

• రజినీకాంత్ – తన వయసుకు తగినట్టే కాకుండా మరింత యంగ్ లుక్‌లో, స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీతో అభిమానులకు కనువిందు కలిగించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో డీ-ఏజింగ్ టెక్నాలజీ సహాయంతో ఇచ్చిన సీన్లు ఒకప్పటి రజనీకాంత్ను గుర్తు చేస్తూ పూనకాలు తెప్పించాయి.
• నాగార్జున – సైమన్ పాత్రలో కూల్, కాల్క్యులేటెడ్ విలన్‌గా మెరిశారు. లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాత్రకు సరిగ్గా న్యాయం చేశారు. చాలా అద్భుతంగా నటించారు.
• ఉపేంద్ర – రజినీ కుడిభుజం పాత్రలో తక్కువ డైలాగ్‌లతోనే బలమైన ఉనికి చాటారు.
• సౌబిన్ షాహిర్ – దయాల్ పాత్రలో విలన్ వైపు నుండి గట్టి పోటీ ఇచ్చారు.
• శ్రుతి హాసన్ – కథలో భావోద్వేగానికి కీలకంగా నిలిచింది.
• అమీర్ ఖాన్ – అతిథి పాత్రలో సరైన టైమింగ్‌తో ఎంటర్ అయి సస్పెన్స్ జోడించారు.
• పూజా హెగ్డే – స్పెషల్ సాంగ్‌తో గ్లామర్ యాడ్ చేశారు.

సాంకేతిక విశ్లేషణ

• దర్శకత్వం – లోకేష్ కనగరాజ్ అభిమానులకి కావలసిన మాస్ ఎలిమెంట్స్ అందించినా, మొదటి భాగంలో కథనం స్లోగా ఉండగా, రెండో భాగంలోనే అసలు పంచ్ ఇచ్చారు. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల మొదటి అర్ధభాగం ఉత్సాహం తగ్గించింది.
• సంగీతం (అనిరుధ్) – పాటలు థియేటర్లో మాస్ మోత మోగించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌లో అదిరిపోయింది. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం సాధారణ స్థాయిలో ఉంది.
• సినిమాటోగ్రఫీ (గిరీష్ గంగాధరన్) – విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. పోర్ట్, సీ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లాంటి సీన్లు అద్భుతంగా కుదిరాయి.
• ఎడిటింగ్ (ఫిలోమిన్ రాజ్) – రెండో అర్థభాగం మరింత కుదించిఉంటే ఉంటే వేగం ఇంకా పెరిగి బెటర్ అయ్యేది.

హైలైట్స్

• రజినీకాంత్ వెనుకటి అవతారం మెప్పించింది.
• రజినీ–నాగ్ల పోటాపోటీ యాక్షన్
• ఉపేంద్ర యాక్షన్ ఎపిసోడ్
• అమీర్ ఖాన్ అతిథి పాత్ర
• క్లైమాక్స్ యాక్షన్

లోపాలు

• ఫస్ట్ హాఫ్‌లో నెమ్మదిగా నడిచే సన్నివేశాలు
• కథలో కొత్తదనం కొరవడటం
• కొన్ని పాత్రలకు తగినంత అవకాశం ఇవ్వకపోవడం

తీర్పు

“కూలీ” – రజినీకాంత్ ఎనర్జీ, నాగార్జున విలనిజం, లోకేష్ మాస్ ట్రీట్‌మెంట్ కలిసిన పండుగ ప్యాకేజీ ఇది. కథలో లోపాలున్నా, స్టైల్, యాక్షన్, మాస్ సీన్స్ అభిమానులను థియేటర్‌లో అలరిస్తాయి. రెండో భాగపు వేగం, హైలైట్ సీక్వెన్స్‌లు సినిమాకి ప్లస్ పాయింట్. సాధారణంగా రెండో అర్థభాగం బాగుంటేనే ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు. అది కూలీలో సంపూర్ణంగా కుదిరింది.

విధాత రేటింగ్: ⭐⭐⭐✨ (3.25/5)