Hitha Chandrashaker | పిల్లలను కనడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్‌.. నటి హితా సంచలన కామెంట్స్‌.

Hitha Chandrashaker | పిల్లలను కనడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్‌.. నటి హితా సంచలన కామెంట్స్‌.

Hitha Chandrashaker : ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండే సెలెబ్రిటీలు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి సంచలనంగా మారుతుంటాయి. కొన్ని కామెంట్స్‌ నెటిజన్‌ల నుంచి ప్రశంసలు కురిపిస్తే, మరికొన్ని కామెంట్స్‌ విమర్శల పాలవుతాయి. ఇంకొన్ని కామెంట్స్‌ మిశ్రమ స్పందన లభిస్తుంది. తాజాగా కన్నడ నటి హితా చంద్రశేఖర్‌ కూడా సంచలన కామెంట్‌ చేసింది. పిల్లలను కనడం కంటే కుక్కను పెంచుకోవడం మేలని వ్యాఖ్యానించింది. ఈ కామెంట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

కన్నడ చిత్రపరిశ్రమలో సిహి కహీ చంద్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి కుమార్తె హితా చంద్రశేఖర్. ఆమె ఇండస్ట్రీకి చెందిన నటుడు కిరణ్ శ్రీనివాస్‌ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తయినా పిల్లలు వద్దని చెబుతోంది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న హితా చంద్రశేఖర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సమాజం తనకు నచ్చలేదని, ఈ నచ్చని సమాజంలోకి మరో బిడ్డను తీసుకురావాలని లేదని వ్యాఖ్యానించింది. మాతృత్వపు మాధుర్యం అనుభవించడానికి పిల్లలనే కనాల్సిన పనిలేదని, ఓ కుక్కను పెంచుకున్నా సరిపోతుందని చెప్పింది.

‘మాకు పిల్లలు కావాలని లేదు. నేను, కిరణ్ స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి చర్చించుకున్నాం. కిరణ్ కూడా నా నిర్ణయాన్ని అంగీకరించాడు. నాకు నా సొంత బిడ్డ ఎందుకు..? నాకు నా బిడ్డ కావాలని అనిపించడం లేదు. నాకు ఈ ప్రపంచం నచ్చడం లేదు. అలాంటప్పుడు మరో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా..? అనిపించింది. నా భర్త కిరణ్ కూడా నాలాగే ఆలోచించాడు. అందుకే అతడు కూడా నా నిర్ణయానికి ఒప్పుకున్నాడు. మాతృత్వాన్ని ఆస్వాదించాలంటే సొంతంగా బిడ్డ ఉండాల్సిన అవసరం లేదు. కుక్కపిల్లను కూడా సొంత బిడ్డలాగే చూసుకోవచ్చు’ అని వ్యాఖ్యలు చేసింది.

వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి పిల్లలు ఉండాలి కదా అని చాలామంది నన్ను అడుగుతున్నారని, కానీ దాని గురించి నాకు అంతగా బాధ లేదని హితా చెప్పారు. అయితే ఎవరూ పిల్లలను కనగూడదని నేను చెప్పడం లేదని, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనని అన్నారు. ఈ విషయం నా తల్లిదండ్రులకు కూడా చెప్పానని, వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టమని కామెంట్స్ చేస్తున్నారు.