V Kaveri Travels | అగ్నికీలలకు 30 మంది వరకు సజీవదహనం.. ప్రత్యక్ష సాక్షి కథనం ఇదీ..
V Kaveri Travels | ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ.. తాను చూసే సరికి బస్సంతా మంటలు వ్యాపించాయి. బస్సు దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. రోడ్డుపై కూడా మంటలు విస్తరించాయి. దీంతో హెల్ప్ చేసేందుకు కూడా అవకాశం లేదు అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
V Kaveri Travels | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నుంచి బెంగళూరు( Bengaluru ) బయల్దేరిన వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels Bus )లో మంటలు చెలరేగి 30 మంది ప్రయాణికుల వరకు సజీవదహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని ఓ యువకుడు తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాడు. ఈ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఆ యువకుడి మాటల్లోనే విందాం.
ప్రత్యక్ష సాక్షి హరీశ్ మాటల్లోనే.. తాను హిందూపూర్ నుంచి నంద్యాలలోని మా అన్న వద్దకు వెళ్తుండగా దారిలో బస్సులో అగ్గి అంటుకుంది. వెంటనే తన కారును ఆపాను. బస్సులో నుంచి ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా బయటకు దూకిన ప్రయాణికులను గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ.. తాను చూసే సరికి బస్సంతా మంటలు వ్యాపించాయి. బస్సు దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. రోడ్డుపై కూడా మంటలు వ్యాపించాయి. దీంతో హెల్ప్ చేసేందుకు కూడా అవకాశం లేదు. రమేశ్ అనే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ గ్లాస్‌ను బ్రేక్ చేసి బయటకు వచ్చాడు. ఆ గ్లాస్ కూడా మనిషి బయటకు వచ్చేంత కూడా లేదు. ఆ గ్లాసులో నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాను అయితే ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఈ ఆరుగురు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రమేశ్ అనే వ్యక్తి చేతికి తీవ్ర గాయమైంది. ఎందుకంటే ఆయనే గ్లాస్ డోర్‌ను బ్రేక్ చేశాడు కాబట్టి అని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడు.
ప్రాణాలతో బయటపడిన వారు రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
బస్సు ప్రమాద ఘటనను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. 30 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనమైనట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరారైన డ్రైవర్, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram