V Kaveri Travels | సీట్లలో ఆ అస్థిపంజరాలను చూసి చలించిపోయా.. ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి
V Kaveri Travels | వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels Bus ) ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి( Hyma Reddy ) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైంది. సీట్లలో ఆ అస్థిపంజరాలను చూసి చలించిపోయాను అని హైమా రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
V Kaveri Travels | హైదరాబాద్ : వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels Bus ) ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి హైమా రెడ్డి( Hyma Reddy ) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైంది. సీట్లలో ఆ అస్థిపంజరాలను చూసి చలించిపోయాను అని హైమా రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
ఈ బస్సు ప్రమాద ఘటనపై హైమారెడ్డి మాటల్లోనే.. నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూల్ వద్దకు రాగానే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అయిందని తెలుసుకునేందుకు డ్రైవర్‌ను అడగ్గా.. బస్సు కాలిపోతున్నట్టు ఉందని చెప్పాడు. పోలీసులు వచ్చారా లేదా అని తెలుసుకునేందుకు కారు దిగి వెళ్లిపోయాను. అక్కడ కొందరు ఏడుస్తున్నారు. కొందరు గాయాలతో బాధపడుతున్నారు. నేను వెంటనే కర్నూల్ ఎస్పీకి ఫోన్ చేశాను. ఎస్పీ వెంటనే స్పందించారు. ఆ వెంటనే కర్నూల్ రూరల్ సీఐ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ కూడా వచ్చాయి. ధర్మవరానికి చెందిన హరీశ్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ లోగా బస్సంతా కాలిపోయింది. అసలు ఆ మాంసపు ముద్దలు, సీట్లలో అస్థిపంజరాలను చూస్తే చాలా బాధేసింది నావల్ల కాలేదు.. చలించిపోయాను. అది తట్టుకోలేకపోయాను. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం. కాపాడానికి అవకాశం లేదు. భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు సకాలంలో స్పందించారు. మంటలను ఆర్పేశారు. బస్సు కిందనే బైక్ ఉండిపోయింది. బైకర్ చనిపోయి రోడ్డు పక్కన పడిపోయాడు అని హైమారెడ్డి పేర్కొంది.
ప్రాణాలతో బయటపడిన వారు రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
బస్సు ప్రమాద ఘటనను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. 30 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనమైనట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరారైన డ్రైవర్, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram