Narne Nithin Wedding | హీరో నార్నె నితిన్ పెళ్లి వేడుక..జూనియర్ ఎన్టీఆర్ ఆశీర్వచనం
జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం శివానీతో శంకర్‌పల్లిలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

విధాత : జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది, యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం వేడుక హైదరాబాద్ శివారు ప్రాంతంలో శంకర్‌పల్లిలో ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె శివానీతో కలిసి నితిన్ ఏడడుగులు వేసి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు ఈ పెళ్లి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
కొత్త దంపతులను ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు. ఆ సమయంలో నితిన్ తన బావ ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆపై తారక్ కూడా వారిద్దరినీ చాలా ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథుల్ని కూడా తారక్ దంపతులే దగ్గరుండి ఆహ్వానించారు. కల్యాణ్ రామ్, రానా వంటి స్టార్ హీరోలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.