రామ్‌చరణ్ సరికొత్త అవతారం? 23 ఏళ్ల తర్వాత తెలుగుతెరపై తిరిగి ఆ జానర్
ఏం జరుగబోతోంది? రామ్‌చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రానున్న #ఆర్సి17 కథ విభిన్నంగా ఉండబోతోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈమధ్య రాని రియలిస్టిక్ జానర్‌ను సుకుమార్ టచ్ చేయబోతున్నాడా?

- మెగా అభిమానులకు పూనకాలు లోడింగ్.?
- స్టైల్, స్టోరీ, సస్పెన్స్ – అన్నీ కలిపిన మెగా వెస్టర్న్ డ్రామా #ఆర్సి17
- మెగాపవర్‌స్టార్‌ను కొత్తగా చూపించబోతున్న లెక్కల మాస్టారు
- అంతర్జాతీయ స్థాయి సాంకేతిక హంగులతో మరో క్లాసిక్
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ – క్రియేటివ్ మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే బాహుబలి స్థాయి అంచనాలు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జంట మళ్లీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పుడు వారి తాజా కలయిక మరింత హైప్ క్రియేట్ చేస్తోంది, అది కూడా 23 ఏళ్ల తర్వాత తెలుగు తెరకు వస్తున్న కౌబాయ్(Cowboy) జానర్లో!
ఇప్పటికే పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సుకుమార్, తాజాగా తన కుమార్తెకు జాతీయ అవార్డు వచ్చిన ఆనందంలో ఉన్నారు. ఈ శుభకార్యాలకు తానూ అనుగుణంగా కొత్త సినిమా కూడా ఫెస్టివల్ లెవెల్లో ఉండాలనుకుంటున్నారట. అందుకే రామ్‌చరణ్‌తో ఓ గ్రాండ్ వెస్టర్న్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నారట. రామ్‌చరణ్‌ను కౌబాయ్‌గా చూడాలని సుకుమార్ కల. ఆయన బాగా సూటవుతాడని నమ్మిన సుకుమార్, ఒక సీన్‌ను ఇంతకుముందే తీసిపెట్టుకున్నాడు. ఈ సినిమాకు “మెకెనా’స్ గోల్డ్(Mackenna’s Gold)” తరహా స్టైల్, స్టోరీ, విజువల్స్ తీసుకురానున్నారు. హాలీవుడ్‌కి సైతం గగుర్పాటు తెప్పించేలా సెటప్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఒక ఇంట్రో కాన్సెప్ట్ వీడియోను చిత్రీకరించి, అదే రాజమౌళికి చూపించగా – “ఇది ఆడియెన్స్‌ను స్పెల్‌బౌండ్ చేస్తుంది” అని ఆయన ఓపెన్‌గానే అన్నాడు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదని కూడా రాజమౌళి నోరుమూసేసుకున్నాడు.
తెలుగు తెరకు కౌబాయ్‌ని పరిచయం చేసింది సూపర్‌స్టార్ కృష్ణ. అదే కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1971లో విడుదలైన ‘మోసగాళ్లకు మోసగాడు’. కథ సరికొత్తగా ఉండటం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా వీరవిహారం చేసింది. తరువాత మెగాస్టార్ చిరంజీవి 1990లో ‘కొదమసింహం’, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 2002లో ‘టక్కరిదొంగ’ ఈ జానర్లో సూపర్హిట్లు. కానీ ఇప్పుడు సుకుమార్ – రామ్‌చరణ్ కాంబో అంతకు మించి పోయే ప్రాజెక్ట్‌లా కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ, హైబడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ కలిసి, ఇది తెలుగులో పుట్టిన తొలి అంతర్జాతీయ కౌబాయ్ సినిమా కావొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కథానాయికలుగా లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలను కన్ఫర్మ్ చేసారని కూడా గుసగుసలు. చిత్రంగా తెలుగు సినిమాల్లో తండ్రీకొడుకులు కౌబాయ్లుగా కనబడటం రెండుసార్లు(కృష్ణ–మహేశ్, చిరంజీవి–రామ్‌చరణ్) కావడం విశేషం.
ఇంకా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు వెలువడలేదు. కానీ, ఫ్యాన్స్ మాత్రం రామ్‌చరణ్‌ను తుపాకీని గిరగిరా తిప్పి సైడ్ హోల్డర్‌లో పెట్టే స్టైలిష్ కౌబాయ్ గెటప్‌లో చూడాలని కలలు కంటున్నారు. ఇది కేవలం సినిమా కాదు… సుకుమార్ విజన్. తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో ట్రెండ్‌సెట్టర్‌గా నిలవబోతోందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.