Megastar Chiranjeevi Birthday | చిరంజీవి బర్త్‌డే బ్లాస్ట్: మాస్ మీల్స్ సిద్ధం! నాలుగు సినిమాలతో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్
ఆగస్టు 22.. ఈ తేదీ ప్రత్యేకతేంటో తెలుగు సినీ ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు. మెగా అభిమానులకు పండగ రోజు. దశాబ్దాలుగా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు, విశేషాలు జరుగుతుంటాయి. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈసారి బర్త్ డే అభిమానులను ఆనందంలో ముంచెత్తే వార్తలతో ఇంకొంచెం స్పెషల్ గా ఉండబోతోంది.

Megastar Chiranjeevi Birthday | మెగాస్టార్ చిరంజీవి ఈసారి తన బర్త్‌డేను అభిమానుల కోసం మర్చిపోలేని మాసివ్ ఫిలిం ఫెస్టివల్‌గా మార్చబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాల విశేషాలతో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు చిరు. తాజాగా పూర్తి చేసిన “విశ్వంభర”, స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటున్న “మెగా 157”, త్వరలో స్టార్ట్ కానున్న “మెగా 158”, అలాగే బాబీతో రూపుదిద్దుకుంటున్న మరో ప్రాజెక్ట్ – ఇవన్నీ కలిపి చిరంజీవి కెరీర్‌లోనే ఓ భారీ లైనప్‌గా నిలవబోతున్నాయి. ఈ ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా మూడు అప్డేట్లు అభిమానులపై వర్షంలా కురవనున్నాయి.
వీటిలో
మొదటిది – వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన “విశ్వంభర” నుంచి ఓ స్పెషల్ వీడియో, అలాగే రిలీజ్ డేట్ ప్రకటన.
రెండవది – అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న “మెగా 157” టైటిల్ అన్‌వీల్.
మూడవది – “మెగా 158” ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, ఎమోషన్ మిక్స్‌గా రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఇవి కాకుండా వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కంబోలో మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతోంది. దీన్ని మెగా 159 గా ప్రకటించబోతున్నారు.
చిరు తన కెరీర్‌లో మళ్లీ ద్విపాత్రాభినయం చేయబోతున్న “మెగా 157” సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో మెరపబోతున్నట్లు సమాచారం. “సంక్రాంతికి వస్తున్నాం” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడితో చిరు కలయికపై ఇండస్ట్రీలో చర్చలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు బాగా ప్రచారమౌతోంది. ఇదిలా ఉండగా, “విశ్వంభర” ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమాగా మలచారు. త్రిష, ఆషికా రంగనాథన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, మ్యూజిక్ మ్యాజిషియన్ ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బర్త్‌డే వీడియో ట్రీట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్‌స్తో ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే దర్శకుడు ప్రకటించాడు.
ఇంతవరకూ ఎప్పుడూ లేని విధంగా చిరు ఈ వయసులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, వరుస ప్రాజెక్ట్‌లతో యువ హీరోలకే పోటీగా నిలుస్తున్నారు. పాత కథాంశాలపై విమర్శల నేపథ్యంలో ఈసారి ఫ్రెష్ కంటెంట్‌తో, నూతన దర్శకులతోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వశిష్ఠ, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, బాబీ – వీరంతా తక్కువ సినిమాల అనుభవం ఉన్నప్పటికీ, చిరు పట్ల అభిమానం, డెడికేషన్, అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో తెలిసినవారే కావడంతో ప్రాజెక్టులపై నమ్మకం మరింత పెరిగింది. ఈ రెండు సంవత్సరాల్లోనే చిరంజీవి నుండి నాలుగు సినిమాలు రావడం ఖాయమవుతోంది. అది కూడా పెద్దగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లు! దీంతో ఆయన తన బర్త్‌డేను నిజంగా అభిమానులకు ఒక సినీ పర్వదినంగా మార్చబోతున్నారు. మిగిలిన హీరోలు ఒక్క టీజర్‌తో సరిపెట్టుకుంటే, మెగాస్టార్ మాత్రం మూడు భారీ ట్రీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆగస్ట్ 22న మెగా బ్లాస్ట్ గ్యారంటీ!