Harihara Veeramallu | మరో వివాదంలో హరిహర వీరమల్లు
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘హరి హర వీరమల్లు’ ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 జనవరిలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. ఒక్క కథను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో ఫస్ట్ పార్ట్ పూర్తి చేయాలనుకున్నారు.

Harihara Veeramallu | ఏ ముహుర్తాన మొదలు పెట్టారో కానీ..’హరిహర వీరమల్లు’ సినిమా ఐదేళ్లుగా పలు రకాల సమస్యలతో చిత్ర నిర్మాణం ఆగుతూ సాగుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకున్న పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంలో అనుహ్యంగా ఈ సినిమాను మరో వివాదం చుట్టుముట్టింది. చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నంపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ)లో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. ఆక్సిజన్, ముద్దుల కొడుకు, బంగారం చిత్రాల బకాయిలు రూ. 2.5 కోట్ల పైచిలుకు ఉన్నాయని.. హరిహర వీరమల్లు విడుదలకు ముందే తమ బకాయి డబ్బులు ఇప్పించాలని వారు ఫిర్యాదులో కోరారు. ఏ.ఎం. రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమా పంపిణీ హక్కులకు సంబంధించి రూ. 2.5 కోట్లు వసూలు చేయాలని కోరుతూ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ డబ్బును రత్నం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. ‘ముద్దుల కొడుకు’, ‘బంగారం’ చిత్రాలకు సంబంధించి ఏ.ఎం. రత్నం నుండి రూ. 90,000 వసూలు చేయాల్సి ఉందని మహాలక్ష్మి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫిర్యాదు చేసింది. తమకు చెల్లించాల్సిన బకాయిలను ‘హరి హర వీరమల్లు’ విడుదలయ్యేలోపునే తమకు ఇప్పించాలని ఆ సంస్ధలు విజ్ఞప్తి చేశాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఈ ఫిర్యాదులు తెరపైకి రావడం గమనార్హం. అయితే వారి ఫిర్యాదులపై టీఎఫ్ సీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వాటితో చిత్రం విడుదలకు ఇబ్బంది ఉండబోదని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఐదేళ్లుగా ఆటంకాల మధ్య హరిహర వీరమల్లు ప్రయాణం
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘హరి హర వీరమల్లు’ ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 జనవరిలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. ఒక్క కథను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో ఫస్ట్ పార్ట్ పూర్తి చేయాలనుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా.. కోవిడ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ బిజీ కావడం..తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా మరింత బీజీ కావడం వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో డైరక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవన్ డేట్స్ ఇచ్చాక సినిమా వేగంగా పూర్తయ్యింది. అయితే జూన్ 12న విడుదల తేదీని ప్రకటించగా..థియేటర్ల బంద్ వివాదంతో సినిమా వాయిదా పడింది. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ కూడా మరో సమస్యగా ఎదురైంది. చివరకు ఎట్టకేలకు సినిమాను సిద్ధం చేసి ఈ నెల 24న విడుదల చేయనుండగా..నిర్మాత బాకీల గొడవతో మరో వివాదంలో చిక్కుకుంది.