Former MLA Rasamayi : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ పై దాడి
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల మధ్య మాటల యుద్ధం కారణంగా, కాంగ్రెస్ శ్రేణులు రసమయి ఫామ్‌హౌస్‌పై దాడికి పాల్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

విధాత : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం సంచలనం రేపింది. బెజ్జంకి మండలం గుండారంలో ఉన్న రసమయి బాలకిషన్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఫామ్ హౌస్ అద్దాలను ధ్వంసం చేశారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య నెలకొన్న మాటల యుద్దం ఈ దాడికి దారితీసింది. నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌లో కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్వహించిన మీడియా సమావేశంలో రసమయి బాలకిషన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో దీనిపై రసమయి బాలకిషన్ సైతం తీవ్రంగా స్పందించారు.
కవ్వంపల్లి సత్యనారాయణపై రసమయి చేసిన అనుచిత వ్యాఖ్యల ఆడియో వెలుగులోకి వచ్చింది. రసమయి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. రసమయి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బెజ్జంకి మండలంలోని గుండారంలో రసమయి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి ప్రయత్నించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్సై సౌజన్య ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ కు తరలించారు.