Jubilee Hills BJP candidate | బీజేపీ తుది నిర్ణయం — జూబ్లీహిల్స్‌లో దీపక్ రెడ్డి సవాల్ ప్రారంభం!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారు. బీఆర్‌ఎస్ నుంచి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్న నేపథ్యంలో పోటీ త్రిముఖంగా మారింది.

Jubilee Hills BJP candidate | బీజేపీ తుది నిర్ణయం — జూబ్లీహిల్స్‌లో దీపక్ రెడ్డి సవాల్ ప్రారంభం!

విధాత సిటీ బ్యూరో, హైదరాబాద్‌:

Jubilee Hills BJP candidate | జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎట్టకేలకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ జాతీయ నాయకత్వం లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సీటు కోసం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా పూర్తి అయింది.

ఇప్పటికే బీఆర్‌ఎస్ నుండి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్, అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థులుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా దీపక్ రెడ్డిని రంగంలోకి దింపడంతో జూబ్లీహిల్స్ బరిలో పోటీ త్రిముఖంగా మారింది.

మల్లగుల్లాల తర్వాత దీపక్​ పేరే ఖరారు..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లంకల దీపక్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 25,866 ఓట్లు సాధించారు. ఆ ఓటు షేర్‌ను ఈసారి గెలుపుగా మార్చాలనే దృఢసంకల్పంతో బీజేపీ అతనిపై నమ్మకం ఉంచింది. సమగ్ర పరిశీలన తర్వాత, స్థానికుడిగా, కుల సమీకరణాల పరంగా బలమైన అభ్యర్థి అని పార్టీ భావిస్తోంది. పైగా, జూబ్లీహిల్స్ వంటి పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పెరుగుతున్న మద్దతు, మోదీ ఇమేజ్, జీఎస్టీ రిఫార్మ్స్, అభివృద్ధి అంశాలు దీపక్ రెడ్డికి అదనపు బలం కలిగిస్తాయని బీజేపీ వ్యూహకర్తలు విశ్వసిస్తున్నారు.

ఇద్దరు యువకులు, గత పరాజితులే మళ్లీ అభ్యర్థులు

ఈ నిర్ణయంతో జూబ్లీహిల్స్ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఒకవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతకు స్థానిక అనుభవం, మరోవైపు కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్, ఇక బీజేపీ తరఫున దీపక్ రెడ్డి — ఈ ముగ్గురి మధ్య హాట్ ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక బీజేపీ వర్గాల ప్రకారం, ఈసారి ఉపఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం కోల్పోయిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీటు గెలవడం ద్వారా పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. దీపక్ రెడ్డి మాత్రం “ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేను స్థానికుడిని, ప్రజల మధ్య ఉన్నాను” అంటూ ప్రచారం ప్రారంభించారు.