Pawan Kalyan’s OG | పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో రికార్డ్‌ – తెలుగు రాష్ట్రాల్లోనే కళ్లు తిరిగేలా..

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఓజీ’ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ అద్భుత రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే ₹135 కోట్లకు పైగా అమ్ముడైన ఈ చిత్రం, పవన్‌ కెరీర్‌లోనే అత్యధిక డీల్‌గా నిలిచింది. దసరా రిలీజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వేట మొదలయ్యే అవకాశం ఉంది.

Pawan Kalyan’s OG | పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌లో రికార్డ్‌ – తెలుగు రాష్ట్రాల్లోనే కళ్లు తిరిగేలా..

Pawan Kalyan’s OG | పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG) విడుదలకు ముందే అద్భుతమైన రికార్డులు నమోదు చేసింది. ‘హరి హర వీరమల్లు’ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా, పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌, మార్కెట్‌ విలువ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ఈ ఒప్పందాలు మరోసారి నిరూపించాయి.

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్‌ యాక్షన్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ముంబయిని కేంద్రంగా చేసుకుని తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌ 25న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటివరకు పవన్‌ కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా భారీ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ₹135 కోట్లకు పైగా అమ్ముడైంది. అందులో నైజాంలో ₹50 కోట్లు, ఆంధ్రలో సుమారు ₹65 కోట్లు, సీడెడ్‌లో మరో ₹20 కోట్లు రాబట్టింది. ఇవన్నీ కలిపి ఇటీవలి కాలంలో అత్యంత పెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

ఇంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా తన బాక్సాఫీస్‌ బిజినెస్‌ను తగ్గించుకుని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావన రావడం తోనే ప్రీ-రిలీజ్‌ వసూళ్లు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ప్రబాస్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల స్థాయికి చేరాయి. ఇటీవల వీరి చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ₹130–150 కోట్ల మధ్య ప్రీ-రిలీజ్‌ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.

పవన్‌ ‘ఓజీ’ ఇప్పటికే ఆ స్థాయిని చేరుకోవడం విశేషం. అంతేకాక, సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ బ్రేకింగ్‌ రన్‌ ఇస్తే కనుక, ఈ స్టార్‌లను కూడా అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘ఓజీ’పై ఉన్న ఈ భారీ క్రేజ్‌కు కారణం పవన్‌ స్టైలిష్‌ మాస్‌ లుక్‌, అలాగే దర్శకుడు సుజీత్‌ విజన్‌. సుజీత్‌ ఇంతకుముందు ప్రభాస్‌తో ‘సాహో’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో పవన్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే మంచి హైప్‌ ఏర్పడింది. ముఖ్యంగా దసరా సెలవులు ఈ సినిమాకు అదనపు లాభం చేకూర్చనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.