దేవుడు గొప్ప డిజైనర్..ప్రకృతి ఉత్తమ గురువు: సీఎం రేవంత్ రెడ్డి

దేవుడు గొప్ప డిజైనర్..ప్రకృతి ఉత్తమ గురువని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని వెల్లడించారు

దేవుడు గొప్ప డిజైనర్..ప్రకృతి ఉత్తమ గురువు: సీఎం రేవంత్ రెడ్డి
  • కృత్రిమ మేథ‌స్సు..బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ
  • 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
  • ఆవిష్కరణలు చేయడానికి తెలంగాణ‌ స‌రైన వేదిక
  • బయోడిజైన్ ఇన్నోవేషన్ స‌మ్మిట్‌లో రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్ట్ 24 (విధాత): దేవుడు గొప్ప డిజైనర్..ప్రకృతి ఉత్తమ గురువని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని వెల్లడించారు. ఆదివారం జరిగిన బయోడిజైన్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్-2025లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల స‌ద‌స్సులో పాల్గొన‌డం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్‌లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువని సీఎం పేర్కొన్నారు. మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారని సీఎం తెలిపారు.

2034 నాటికి 1ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించామని, 2034 నాటికి తెలంగాణ‌ను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి తెలంగాణ‌ను మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ గా మారుస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా ఉందన్నారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణల‌కు కేంద్రంగా తెలంగాణ‌ను మారుస్తున్నామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక స్టార్టప్‌లు, ఎమ్ఎస్ఎంఈలు గ్లోబల్ కంపెనీలతో పాటు క‌లిసి ప‌నిచేస్తున్నాయని చెప్పారు. సామాన్య ప్రజల సమస్యల ప‌రిష్కారం కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి , ఏఐజీ హాస్పిట‌ల్‌ను అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు.

చాలా ఏళ్లుగా మ‌న మేథ‌స్సుని ఇత‌ర దేశాల ప్ర‌జ‌ల కోసం ఉప‌యోగిస్తున్నాం.. ఇప్పుడు మ‌న ప్ర‌జ‌ల మంచి కోసం ప‌నిచేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిందని వెల్లడించారు. అందుకోసం ప్ర‌భుత్వం నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. డాటా గోప్య‌తను పాటిస్తూనే ఇక్క‌డ ప్ర‌జ‌ల వైద్య‌స‌హాయం కోసం అవ‌స‌ర‌మైన డాటాను అందజేస్తామన్నారు. స్కిల్ యూనివ‌ర్సిటీ, కార్పొరేష‌న్లు, విద్య సంస్థ‌లు, రీసెర్చ్ సెంట‌ర్స్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అనిశ్చిత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయని.. ప‌న్నులు, యుద్ధాలు, వాణిజ్య‌ప‌ర‌మైన అడ్డంకులు వంటివి ఎదుర‌వుతున్నాయన్నారు. ఈ స‌మ‌యంలో ఆవిష్కరణలు చేయడానికి స‌రైన వేదిక తెలంగాణ‌ అని స్పష్టం చేశారు. మాన‌వాళిని మ‌రింత ఆరోగ్యంగా మార్చ‌డానికి మ‌నంద‌రం ప్ర‌య‌త్నం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.