వచ్చే ఐదేళ్లలో 1.50 కోట్ల యాప్స్ మాయం..ఆ స్థానంలో ఏఐ ఏజెంట్లు
వచ్చే ఐదేళ్లలో సుమారు ఒక కోటి యాభై లక్షల మొబైల్ యాప్ లు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
- వచ్చే ఐదేళ్లలో యాప్స్ మాయం
- 1.50 కోట్ల యాప్ లు గల్లంతు
- ఆ స్థానంలో ఏఐ ఏజెంట్లు
విధాత : స్మార్ట్ ఫోన్ యుగంలో వెబ్ సిరీస్ చూడాలన్నా, విమానం లో టికెట్ బుక్ చేయడానికి, క్యాబ్ బుక్ చేయాలంటే యాప్ ఉండాల్సిందే. అవి కూడా దేనికవే కావడంతో అవసరం ఉన్న యాప్ లను డౌన్ లోడు చేసుకోవడం మూలంగా ఫోన్ మెమోరీ ప్రధాన సమస్యగా మారింది. కొన్ని ఫోన్లలో మెమెరీ సరిపడా లేకపోవడంతో ఆ స్థాయికి తగ్గట్టుగా ఫోన్లనే మార్చుకుంటున్నారు. యాప్ లతో సంబంధం లేకుండా ఈ సమస్యను రానున్న ఐదేళ్లలో అధిగమించే పరిస్థితులు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో సుమారు ఒక కోటి యాభై లక్షల మొబైల్ యాప్ లు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
న్యూఢిల్లీ భారత మండపంలో వారం రోజుల క్రితం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నిర్వహించగా ప్రపంచం నలుమూలల నుంచి టెక్ ప్రముఖులు పాల్గొన్నారు. జాతర మాదిరి జరిగిన ఈ సమ్మిట్ లో వచ్చే ఐదేళ్లు, పదేళ్లలో ఐటీ రంగంలో వచ్చే మార్పులను వివరించారు. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ లలో ఉండే 15 మిలియన్ల అప్లికేషన్లు వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మాయమవుతాయని పాలో అల్టొ నెట్ వర్క్స్ సైబర్ సెక్యురిటీ కంపెనీ సీఈఓ నికేశ్ అరోరా వెల్లడించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు. సమీప భవిష్యత్తులో స్థానిక భాషలలో ఏఐ ఏజెంట్లు యాప్ ల స్థానాన్ని ఆక్రమిస్తాయన్నారు. విమానంలో ప్రయాణించేందుకు టికెట్ కొనుగోలు చేసేందుకు గమ్యస్థానం, పేరు, తేదీలు వంటి వివరాలు యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళేందుకు క్యాబ్ లో ప్రయాణించాలంటే మరో యాప్ కు వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయలంటే మరో యాప్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితులు నిత్య జీవితంలో ఎదురవుతున్నాయి. ప్రతి పనికీ యాప్ ఉండడం సమస్యగా పరిణమించడమే కాకుండా ఫోన్ మెమొరీ కూడా సమస్యగా తయారైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ సంప్రదాయ విధానం రానున్న ఐదేళ్లలో పూర్తిగా మారిపోతుందని, ఏఐ ఏజెంట్లు ఈ పనిని సులువుగా పూర్తి చేస్తాయని పేర్కొన్నారు. యాప్ లతో అవసరం లేకుండా ఏయిర్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవడం, హోటల్ లో టిఫిన్ ఆర్డర్ చేయడం, టాక్సీ బుక్ చేసుకోవడం వంటి పనులను సూపర్ ఏజెంట్లు చకచకా పూర్తి చేయనున్నాయి. మన స్మార్ట్ ఫోన్ లో కావాల్సిన వివరాలు మాటల్లో చెబితే ఈ పనులు పూర్తి చేసి పెడుతుంది. పలువురు ఏజెంట్లు, యాప్ లు చేయలేని పనులను ఏఐ ఏజెంట్లు స్వల్ప వ్యవధిలో పూర్తి చేస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) తో ఊహించని మార్పులు వస్తాయని చర్చ జరుగుతున్న తరుణంలో ఒక్కో రంగంలో ఏ మార్పులు సంభవిస్తాయనేది టెక్ నిపుణులు ఈ సమ్మిట్ లో వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram