AR Rehman Magic Peddi | చాలాకాలం తర్వాత మాస్ మెలొడీతో రెహమాన్ మ్యాజిక్ : ‘చికిరి..’ ఫ్రం ‘పెద్ది’
పెద్ది తొలి సింగిల్ చికిరి.. ఊహించినట్లుగానే సోషల్ మీడియా అంతా “రెహమాన్ మ్యాజిక్ ఇజ్ బ్యాక్” అంటూ మార్మోగుతోంది.. ఏఆర్ రెహమాన్ మాస్ మ్యూజిక్ మ్యాజిక్కు ఫ్యాన్స్ ఫిదా. బాలాజీ రచించిన పాట, జానీ మాస్టర్ డాన్స్ డైరెక్షన్, రత్నవేలు కెమెరా పనితనం పెద్దిని చాలా పెద్ద ఎత్తున ప్రజెంట్ చేసాయి. రామ్‌చరణ్ ఎనర్జీ, జాన్వీ కపూర్ లుక్ పాటను ట్రెండ్‌లోకి తీసుకొచ్చాయి.
AR Rahman’s Magic Returns With “Chikiri” Song From ‘Peddi’ — Ram Charan’s Dance Sets Screen On Fire
(విధాత వినోదం డెస్క్)
నిన్న ఊరించిన చికిరి.. టీజర్ బిట్ రాత్రి మెగా అభిమానులకు నిద్ర లేకుండా చేసింది. ఎట్టకేలకు వారి ఆనందానికి అడ్డులేకుండా నేడు పెద్దిలోని ఆ పూర్తి పాటను విడుదల చేసారు.
ఊహించినట్లుగానే పాట అదిరిపోయింది. రహమాన్ మాస్ పాటకు మ్యూజిక్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. తానెంతో ఇష్టపడిన కథకు సంగీతం ఇస్తున్నానని ప్రకటించిన ఏఆరార్, తన ఇష్టం ఏ రేంజ్లో ఉందో తెలిపే ప్రయత్నమే ఈ చికిరి.. ఆయన హృదయం ఎంతగా ఈ కథతో కలిసిపోయిందో ఈ పాట చెబుతోంది. ఆధునిక ఎలక్ట్రానిక్ బీట్స్‌తో పాటు జానపద శైలిలో రూపొందిన ఈ పాట ఆద్యంతం హుషారుగా సాగింది.
ఇక జానీ మాస్టారు సమకూర్చిన నృత్యరీతులు నభూతో అన్నట్లున్నాయి. రామ్‌చరణ్ చాలా ఈజ్‌తో చేసిన డాన్స్ మైమరిపింపజేసింది. నోట్లో బీడీతో, చేతితో బ్యాట్‌తో తను వేసిన స్టెప్పులు నిజంగానే మెగాస్టార్‌ను గుర్తుకుతెచ్చాయి. చాలా మామూలు డ్రెస్‌తో, ఊరమాస్ గెటప్‌లో చరణ్ హీరోయిన్ను తలుచుకుంటూ, ఊహల్లో తేలిపోతూ, అదోరకమైన మత్తులో తూగినట్లు ఉన్న డాన్స్స్టెప్పులు పాటకు సరిగ్గా అమిరాయి. ఇక నాయిక అచ్చియమ్మగా అప్పుడప్పుడూ కనబడే జాన్వీ తన పొగరు, వగరుతో కుర్రకారును నుంచోబెట్టేసింది. ‘గుండె చొంగకార్చుకుంటోంద’న్న పాటలోని మాట అచ్చంగా అచ్చియమ్మను చూసే రాసినట్టుంది.
మోహిత్ చౌహాన్ గొంతు పాటకు జాదూ జోడించింది. హీరో హృదయంలోని ఆ మైమరపు, తపనను ఆయన వాయిస్‌లో అచ్చంగా దించేసాడు. ఇక పాట రాసిన బాలాజీ, చిన్న చిన్న పల్లె పదాలతో, పాటను అల్లి అందరూ సులభంగా పాడుకునేలా, వాడుకునేలా చేసాడు. రత్నవేలు కెమెరా పనితనం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అద్భుతమైన ప్రకృతి అందాలను స్వచ్ఛంగా, కాంతివంతంగా తన ఫ్రేమ్‌లలో బంధించాడు. లొకేషన్లు ఎక్కడివో గానీ, చాలా అందంగా, ప్రశాంతంగా ఉన్నాయి. ట్రెండింగ్ ఎడిటర్ నవీన్ నూలి పాటను ఎడిట్ చేసిన విధానం ఎక్కడా కంటిన్యుటీ మిస్ కాకుండా ఆకట్టుకుంది.
రామ్‌చరణ్ ఎనర్జీ, జానీ మాస్టర్ డాన్స్, బాలాజీ లిరిక్స్, రత్నవేలు విజువల్స్ — అన్నీ కలసి ఈ పాటను మాస్–మెలోడి బ్లెండెడ్ హిట్గా నిలిపాయి. ఇక అభిమానులు, రీల్ హీరోలు, షార్ట్స్ హీరోయిన్లకు చేతినిండా పనే. కేవలం గంట క్రితం యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటికే 10 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇది ఎక్కడిదాకా పోతుందో చూద్దాం.
AR Rahman’s latest single “Chikiri” from Peddi brings together mass beats and folk melody with his signature finesse. Ram Charan’s lively dance moves, Janhvi Kapoor’s charming screen presence, and Johnny Master’s choreography make it a visual treat. Penned by Balaji and filmed by Ratnavelu, the song has already crossed over a million views within hours of release.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram