HRC Notice on Pushpa 2 | పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై హెచ్ ఆర్సీ సీరియస్
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటపై హెచ్‌ఆర్సీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు.. రూ.5లక్షల పరిహార ఆదేశం!

HRC Notice on Pushpa 2 | విధాత, హైదరాబాద్ : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ ఘటపై విచారణ చేసిన కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన బాధితులకు రూ.5లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. తొక్కిసలాట ఘటనలో పోలీసుల వ్యవహారంపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్ ను, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో ప్రిమియర్ షో ప్రదర్శనకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ముందుకెళ్లారు.
ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ చనిపోగా..ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలకు గురై క్రమంగా కోలుకుంటున్నారు. శ్రీతేజ్ కు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 146 రోజులు పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విషాదకరమైన ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్టు చేసి రిమాండ్ సైతం చేశారు. అనంతరం అల్లు అర్జున్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.