యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు…విద్య కేవలం ఉపాధి కోసమే కాదు : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యూనివర్సిటీ‌లు విజ్ఞాన భాండాగారాలు అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం ఆయన పాలమూరు యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 16, 2025 10:41 PM IST
యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు…విద్య కేవలం ఉపాధి కోసమే కాదు : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
  • యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు
  • విద్య కేవలం ఉపాధి కోసమే కాదు
  • జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలి
  • రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వ్యాఖ్యలు
  • పాలమూరు వర్సిటీ నాల్గవ స్నాతకోత్సవం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : యూనివర్సిటీ‌లు విజ్ఞాన భాండాగారాలు అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం ఆయన పాలమూరు యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముందుగా పాలమూరు విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియం వద్ద గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు జిల్లా కలెక్టర్ విజయేందిరా బోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ మన్నే సత్యనారాయణ రెడ్డి కి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. అలాగే 12 మందికి పీహెచ్ డీ అవార్డులను, 83 మందికి గోల్డ్ మెడల్స్ ఆయన ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్, పాలమూరు విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, ఇక్కడ సంపాదించిన జ్ఞానం, ధైర్యం, వినయం, అంకితభావంతో ప్రపంచంలోకి అడుగుపెట్టాలని..గ్రాడ్యుయేటర్లను సమాజం గొప్ప అంచనాలతో చూస్తుందని, ఎవరు ఎంచుకున్న రంగాల్లో వారు రాణించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ అన్నారు. డాక్టరేట్ స్కాలర్లు, బంగారు పతక విజేతలు, పట్టభద్రులైన విద్యార్థులందరినీ అభినందించారు. మానవాళికి సేవ చేయడానికి ఎంచుకున్న రంగాల్లో రాణించాలన్నారు. ఇక్కడ సంపాదించిన జ్ఞానంతో, ధైర్యం, అంకితభావంతో ప్రపంచంలోకి అడుగు పెట్టాలని సూచించారు. పిల్లలు ఉద్యోగాల కోసం కాదు, మనస్సు యొక్క జీవితాన్ని మొదటిసారి చూడటం కోసమే పాఠశాలకు వెళతారని అని చెప్పిన అమితవ్ ఘోష్ మాటలను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు.

విద్య కేవలం ఉపాధికి సిద్ధం కావడం కంటే, ఊహను మేల్కొల్పడం, జీవితాంతం ఉత్సుకతను రేకెత్తించడమే అన్నారు. జ్ఞానార్థ ప్రవేశం, సేవార్థ ప్రస్థానం అనే గొప్ప సూక్తుల ద్వారా ప్రయాణాన్ని ప్రకాశవంతం చేస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం, కేవలం ఒకటిన్నర దశాబ్దంలోనే విద్యా మౌలిక సదుపాయాలలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించిందన్నారు. విశ్వవిద్యాలయాలు ఆధునిక భారతదేశ దేవాలయాలని నిరూపించాయని చెప్పారు. పీఎం ఉషా పథకం కింద రూ.వంద కోట్లు పొందినందుకు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యా రంగంలో అగ్రగామిగా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి యువత హృదయాలలో తెలివితేటలను మాత్రమే కాకుండా స్థితిస్థాపకతను పెంపొందించేందుకు దోహదపడుతున్నాయన్నారు.

21వ శతాబ్దపు ఈ జ్ఞాన యుగంలో, విశ్వవిద్యాలయాలు తమ లక్ష్యాన్ని పునర్నిర్వచించుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఆవిష్కరణలను స్వీకరించాలని, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, జాతీయంగా గర్వించదగిన జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించాలన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం తన అక్రిడిటేషన్, మూల్యాంకన వ్యవస్థలను పెంపొందించుకోవడానికి నిరంతరం కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యాపరంగా మించి ఎదిగి సమాజానికి అర్థవంతంగా దోహదపడాలన్నారు. ఈ స్ఫూర్తితో, పాలమూరు విశ్వవిద్యాలయం ‘ఏక్ పెడ్ మా కే నామ్’ అనే జాతీయ ప్రచారాన్ని చురుకుగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన కోరారు.

తల్లి పేరిట ఒక చెట్టును నాటడం అనేది పర్యావరణ పరిరక్షణ చర్య మాత్రమే కాదు, తరాలు, ప్రకృతి మధ్య బంధానికి లోతైన భావోద్వేగ వ్యక్తీకరణమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. యువత పర్యావరణ, సాంస్కృతిక నాయకత్వం రెండింటికీ విజేతలుగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు రిజిస్టార్ రమేష్ బాబు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, క్రీడల ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ఐ.జీ. ఎల్.ఎస్.చౌహాన్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్వోడీలు, తదితరులు ఉన్నారు