బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టిల్లు గాడు. మరో రికార్డ్ మార్క్ దిశగా దూసుకెళుతున్నాడే..!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సిద్దు జొన్నలగడ్డ. కెరీర్ ఆరంభం నుంచే విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్న అతను డీజే టిల్లు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇక అదే ఊపులోనే ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమా చేశాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. మొదటి ఆట నుండే ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తుంది. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. చిత్రంలో డిఫరెంట్ డైలాగ్ డెలవరీ, వెరైటీ బాడీ లాంగ్వేజ్ తో సిద్ధు ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్నాడని చెప్పాలి. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది.
ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ అందించారు. 9 రోజుల్లో ఈ మూవీ రూ. 52 కోట్లకు పైగా షేర్‌ను వంద కోట్ల వరకూ గ్రాస్‌ను రాబట్టి సత్తా చాటింది. యూఎస్ మార్కెట్ లో కూడా టిల్లు హవా మామూలుగా లేదని చెప్పాలి. రెండున్నర మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళుతుంది. ఈ స్పీడ్ లో సెన్సేషనల్ మార్క్ 3 మిలియన్ క్లబ్ లో కూడా టిల్లు స్క్వేర్ జాయిన్ కావడం ఖాయమని అంటున్నారు.ఒకవేళ ఇదే జరిగితే యంగ్ హీరోస్ లో సిద్ధూ బాయ్ ఓ యూనిక్ రికార్డు అందుకున్న వాడిగా నిలుస్తాడు.
టిల్లు స్క్వేర్ మూవీపై ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాని చూసి.. “డియర్ సిద్ధూ నీ విజయాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీంని అభినందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా సిద్ధు, ప్రోడ్యూసర్, విశ్వక్ సేన్ కు పార్టీ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి.