Mystery of Death | మనం చనిపోయాక ఏం జరుగుతుంది? మనకు ఏం కనిపిస్తుందో చెప్పిన తాజా అధ్యయనం!
మనం చనిపోయాక ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్నవాళ్లు ఏడుస్తూ ఉంటారు. కానీ.. చనిపోయిన వ్యక్తి ఏమవుతాడు? ఎక్కడికి వెళతాడు? చనిపోయిన సమయంలో ఏం కనిపిస్తుంది? యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తలు ఈ విషయంలో కీలక అధ్యయనం చేశారు. సంచలన విషయాలు బయటపెట్టారు.
Mystery of Death | మరణానంతరం! ఇదొక పెద్ద మిస్టరీ! ఎందుకంటే మరణానంతర పరిస్థితిని చూసినవాళ్లు ఎవరూ లేరు! చనిపోయిన జీవుడు స్వర్గానికో, నరకానికో వెళతాడని దాదాపు అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. మరణానంతర జీవితం గురించి గరుణ పురాణం ప్రత్యేకంగా వివరిస్తుంది. అదెలా ఉన్నా.. మరణించే సమయంలో మనిషిలో ఏం జరుగుతుంది? మరణించాక ఏమవుతుంది? అనే విషయంలో అనేక అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. మరణం తర్వాత తొలి క్షణాల్లో ఏం జరుగుతుంది? తర్వాత ఎక్కడికి వెళతాం.. అనే అంశాలను శోధిస్తూనే ఉన్నారు. ఈ కోవలో కొత్తగా యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఒక అధ్యయనం నిర్వహించింది. మరణం మిస్టరీని ఛేదించేందుకు కొంత ప్రయత్నం చేసింది. ఈ అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. తీవ్ర అనారోగ్యం బారిన పడి.. మరణం అంచుల వరకూ వెళ్లివచ్చిన రోగులలో 15 శాతం మంది వింతైన అనుభవాలను చవిచూసినట్టు ఈ అధ్యయనం తెలిపింది.
యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోని సైకియట్రి డిపార్ట్‌మెంట్, న్యూరోబిహేవియరల్ సైన్సెస్ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. చావు నుంచి బయటపడిన 167 మందితో సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో కనుగొన్న అంశాలను సైకాలజీ ఆఫ్ కాన్షియస్‌నెస్: థియరీ, రిసెర్చ్ అండ్ ప్రాక్టిస్ లో ప్రచురించారు. చావు అంచుల వరకూ వెళ్లి బతికినవాళ్లలో దాదాపు 70 శాతం మంది వారివారి మతాచారాలను మార్చుకోవడం లేదా ఆధ్యాత్మిక నమ్మకాలను మార్చుకోవడం జరిగిందని అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.. వారికి మరణం అంటే భయం కూడా పోయిందని పేర్కొన్నది. మనిషి గాలిలో తేలిపోతున్నట్టు, ఒక గుహలో అత్యంత కాంతివంతమైన ద్వారం వైపు వెళుతున్నట్టు, గొప్ప ప్రశాంతత లభించినట్టు రకరకాల అనుభూతులు ఎదురవుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. తీవ్ర అనారోగ్యానికి గురై, దాదాపు చనిపోయే పరిస్థితి నుంచి బయటపడిన కొందరు రోగులు ఈ వింత అనుభూతులు అనుభవించారని తెలిపింది. ఆ అనుభూతిని మనిషి తన జీవితకాలంలో మర్చిపోలేడని పేర్కొన్నది.
సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది నిపుణుల లేదా ఆధ్యాత్మిక మద్దతు కోరుకున్నారని, 78 శాతం మంది దాన్ని సహాయకారిగా భావించారు. చాలా మంది తాము ఆ అనుభూతిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడినట్టు తెలిపారు. ఇటువంటి పేషెంట్లకు ఎలాంటి మద్దతు ఇవ్వాలి? వారి నిర్దిష్టమైన అవసరాలు తీర్చడం ఎలా? అనే విషయాల్లో పరిశోధనకు పరిమితులు ఉన్నాయని మారియెటా పెహ్లివనోవా చెప్పినట్టు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ అంతరాన్ని పరిష్కరించేందుకు వైద్య నిపుణులు మరింత చొరవ చూపాలని ఆమె కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram