Wayanad | వయనాడ్ వరద బాధితులకు సినీ పరిశ్రమ బాసట

కేరళా వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడి వరదల బీభత్సంతో 357మంది మృతి చెందగా, మరో 206మంది గల్లంతైన విషాద ఘటన పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు

Wayanad | వయనాడ్ వరద బాధితులకు సినీ పరిశ్రమ బాసట

ఒక్కొక్కరుగా విరాళాల ప్రకటన
మాలీవుడ్‌.. టాలీవుడ్‌..కోలీవుడ్ నటుల వరుస విరాళాలు

విధాత, హైదరాబాద్ : కేరళా వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడి వరదల బీభత్సంతో 357మంది మృతి చెందగా, మరో 206మంది గల్లంతైన విషాద ఘటన పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషాల హీరోలు, నటీ నటులు వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కేరళా ఎంపీ, హీరో మోహన్‌లాల్ 3కోట్ల విరాళం ప్రకటించారు.

టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్‌తో కలిపి 1కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ కూడా న వంతు సాయంగా రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. మృతుల కుటుంబాలకు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాడ్‌ ఘటన తనని కలచి వేసిందన్నారు. కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని చెప్పారు. అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మ‌ల‌యాళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్‌ని మ‌ల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ కూడా రూ.5 లక్షలు సాయం ప్రకటించింది.

కాగా, ఇప్పటికే పలువురు స్టార్స్‌ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. న‌య‌న‌తార‌, విఘ్నేశ్ దంప‌తులు రూ.20 లక్షలు, విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య 100ఇళ్లను నిర్మిస్తామన్నారు. తాజాగా మరికొంత మంది కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు. అపర కుబేరుడు గౌతమ్ అదానీ తమ గ్రూప్ తరుపున 5కోట్ల ఆర్థిక ససాయం ప్రకటించారు. కమల్ హాసన్, మలయాళ స్టార్ హీరో టోవినో థామ‌స్ తన వంతు విరాళాలను ప్రకటించారు. అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దగా ఇంకా ఎవరు విరాళాలకు సంబంధించి ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.