అవినీతిలో పౌరసరఫరాల శాఖ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రోజురోజుకు అవినీతి పేరుకుపోయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని స్థానికంగా తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి

  • By: Subbu    crime    Dec 10, 2023 12:57 PM IST
అవినీతిలో పౌరసరఫరాల శాఖ
  • ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్టాకులో అవకతవకలు.
  • స్టాక్ రికార్డులకు, బియ్యం నిల్వలకు కుదరని పొంతన
  • పట్టించుకోని తనిఖీ అధికారులు
  • గోదాంల్లో వేల క్వింటాళ్ల బియ్యం గోల్ మాల్
  • గోదాం ఇంచార్జీలపై చర్యలు శూన్యం
  • కోటపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలో 150 క్వింటాళ్ల బియ్యం గోల్‌మాల్ ?

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రోజురోజుకు అవినీతి పేరుకుపోయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరని స్థానికంగా తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి. సివిల్ సప్లై శాఖకు సంబంధించి ప్రతి జిల్లాలో బియ్యం నిల్వ చేయడానికి రెండు గోదాములు ఉంటాయి. ఒకటి స్టేట్ వెర్ హౌస్ కార్పొరేషన్ (ఎస్‌డబ్ల్యుసీ) గోదాం , రెండవది మండల్ లెవెల్ స్టాకిస్ట్ పాయింట్ (ఎంఎల్‌ఎస్‌) గోదాములు ఉంటాయి . రైతుల నుండి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి వాటిని రైస్ మిల్లులకు పంపించి మరాడించి బియ్యంగా మార్చిన తర్వాత రైస్ మిల్లు నుండి స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదాములకు తరలిస్తారు.


ఎస్‌డబ్ల్యుఎస్‌ గోదాములకు మిల్లు నుండి బియ్యం తరలించేటప్పుడు బియ్యం నాణ్యత చూసి గోదాంలోకి పంపించాల్సి ఉంటుంది. నాణ్యత చూడాల్సిన అధికారులు మిల్లు నుండి వచ్చిన బియ్యం ఎలా ఉన్నా తీసుకోవడానికి ప్రతి లారీకి ఇంత రేటు అంటూ తీసుకొని గోదాంలోకి పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బియ్యం నాణ్యత చూడకపోవడం మూలంగానే బియ్యం పంపిణీలో అప్పుడప్పుడు ప్లాస్టిక్ బియ్యం ముక్కిపోయిన బియ్యం వస్తాయి అనేది రేషన్ షాప్ డీలర్లు, ప్రజలు చెబుతున్నారు. ప్రజలు డీలర్లను ఇలాంటి బియ్యం మీరు తింటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ నిర్లక్ష్యం మూలంగా ఈ తతంగం నడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ప్రతి నెల ఎస్‌డబ్ల్యుఎస్‌ గోదాం నుండి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాములకు బియ్యం తరలించి అక్కడ నుండి రేషన్ షాపులకు లారీల ద్వారా బియ్యాన్ని తరలిస్తారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుండి ప్రతి రేషన్ షాపుకు ప్రతినెల బియ్యాన్ని రేషన్ షాపులకు పంపిస్తారు.

ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదాంల్లో అక్రమాలు

మంచిర్యాల జిల్లాలో గతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలో భారీగా అవకతవకలు జరిగాయి. ప్రస్తుతం కోటపల్లి మండల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో గోల్‌మాల్ జరిగినట్లు సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో సంవత్సరం క్రితం నుండి భారీ ఎత్తున ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలో అవినీతి బాగోతం నడుస్తుంది. ప్రతి గోదాంకు ఒక అధికారి ఒక ఇంచార్జీగా ఉంటారు .

మంచిర్యాల జిల్లా మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ గోదాములో దాదాపు 15 నెలల క్రితం 5వందల నుండి 670 క్వింటాళ్ల బియ్యం గోల్ మాల్ జరిగినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేసి 570 క్వింటాళ్ల బియ్యం గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించారు. ఐనప్పటికి అప్పటినుండి ఇంతవరకు ఆ సంబంధిత ఇంచార్జీగా మెమో ఇచ్చి సస్పెండ్ చేయడం తప్ప బియ్యం రికవరీ ఇంతవరకు చేయకపోవడంపై పలు విమర్శలకు తావిస్తుంది.


సంబంధిత ఇంచార్జీ అధికారి నుండి బియ్యం లోడ్‌ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో ఆ బియ్యానికి సంబంధించి రికవరీ యాక్ట్ ప్రకారం ప్రతి క్వింటాలుకు రెండు క్వింటాళ్ల బియ్యానికి రేటు నిర్ధారించి రికవరీ చేయాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ ఇంతవరకు బియ్యం డబ్బులు రికవరీ చేయలేదు. ఏదో మొక్కుబడిగా ఛార్జ్‌షీట్‌ సస్పెండ్స్ తప్ప అక్రమాలకు పాల్పడిన సొమ్ము రికవరీపై అధికారులకు శ్రద్ధ చూపడం లేదని ఈ విషయం తెలిసిన స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొనసాగుతున్న అవకతవకలు

ఇదిలా ఉంటే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఒక కాగజ్ నగర్ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలోనే గతంలో దాదాపు రెండువేల క్వింటాళ్ల బియ్యం గోల్‌మాల్ జరిగింది. దీనిపై తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నిర్ధారించి ఇంచార్జీ అధికారిపై నామమాత్రపు చర్యలు తీసుకొని ఆ సంగతి మర్చిపోయారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని వారు అమ్ముకున్న బియ్యాన్ని రికవరీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని స్థానికంగా ఒక చర్చ కొనసాగుతుంది.


ఇక్కడ అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎలాంటి రికవరీ కఠినమైన చర్యలు లేకపోవడంతో ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాంలో ఉన్న రికార్డులకు నిల్వ ఉన్న బియ్యానికి తేడా ఉన్నట్లు సమాచారం. స్టాక్ రికార్డులో ఉన్న బియ్యం, నిల్వ ఉన్న బియ్యానికి దాదాపు 150 క్వింటాళ్ల బియ్యం లోటు ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కోటపల్లి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ గోదాం తనిఖీ చేస్తే అవినీతి అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై చూసి చూడనట్టు వ్యవహరించడం మూలంగానే వేల టన్నుల బియ్యం గోల్ మాల్ జరిగినప్పటికీ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వమైనా సివిల్ సప్లై శాఖ పై దృష్టి పెట్టి అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.