Crime News | ప్రియుడితో మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు

తెలంగాణలో ప్రేమ వ్యవహారం విషయంలో తమ్ముడు రోహిత్ అక్క రుచితను హత్య చేసిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో మాట్లాడుతుందన్న కోపంతో గొంతు బిగించి చంపాడు. హత్యకు ముందు రీల్స్ చేశాడన్న సమాచారం కలకలం రేపుతోంది.

Crime News | ప్రియుడితో మాట్లాడుతుందని అక్కను హత్య చేసిన తమ్ముడు

Crime News | విధాత : ప్రియుడితో తరుచు మాట్లాడుతుందన్న కోపంతో అక్కని చంపిన తమ్ముడు ఉదంతం తెలంగాణలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం వేచి చూస్తున్న పెద్ద కూతురు రుచిత(21) గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువకుడికి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుంది. ఈ విషయమై పలుమార్లు రెండుకుటుంబాలకు గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయతీకి వెళ్లగా.. ఇకపై మాట్లాడుకోబోమని ప్రేమికులు ఇద్దరు కూడా వాగ్ధానాలు చేశారు. అయితే సోమవారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత మళ్లీ ఆ యువకుడితో మాట్లాడడం చూసిన తమ్ముడు రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి ఆవేశంగా అక్క గొంతును వైరుతో బిగించడంతో ఊపిరాడక చనిపోయింది.

రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్‌ను రిమాండ్‌కు తరలించారు. అయితే హత్యకు ముందు రోహిత్ చేసిన రీల్స్ వ్యవహారం ఆసక్తిగా మారింది. అక్కను చంపే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రోహిత్ ఫోన్లో “బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా” అనే రీల్‌ను పోలీసులు గుర్తించారు. రోహిత్ చేసిన రీల్స్ చూస్తే అతను తన అక్కను లేదా…ఆమె ప్రియుడిని చంపాలని ముందే నిర్ణయించుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.