ATM Fraud | వామ్మో.. ఏటీఎం నుంచి ఇలా కూడా డబ్బులు కొట్టేస్తారా?

ఏటీఎం చోరీలు ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఏటీఎం మిషన్‌లో కస్టమర్‌ డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన సమయంలో క్యాష్‌ బయటకు రాకుండా అడ్డుకుంటున్న నేరస్తులు.. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆ డబ్బును దోచుకుంటున్నారు. ఈ ముఠాను కాజీపేటలో సీసీఎస్‌, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

  • By: TAAZ |    telangana |    Published on : Dec 29, 2025 4:24 PM IST
ATM Fraud | వామ్మో.. ఏటీఎం నుంచి ఇలా కూడా డబ్బులు కొట్టేస్తారా?

విధాత, వరంగల్ ప్రతినిధి:

ATM Fraud | ఏటీఎంల నుంచి డబ్బులు చోరీ చేయడంలో ఒక్కోసారి ఒక్కో కొత్త తరహా పద్ధతిని దొంగలు రూపొందిస్తుంటారు. తాజాగా అలానే ఒక ముఠా ఏటీఎం నుంచి డబ్బులు బయటకు రాకుండా అడ్డుకుని, సదరు కస్టమర్‌ వెళ్లిపోయిన తర్వాత వాటిని జేబులో వేసుకుంటున్నది. రాజస్థాన్‌కు చెందిన ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుని, దాని ఆటకట్టించారు. వీరి నుంచి ఐదు లక్షల పదివేల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్‌ ప్లేట్లను, డూప్లికేట్‌ తాళాలను సీసీఎస్‌, కాజీపేట పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు.

అంతరాష్ట్ర ముఠా నిందితుల వివరాలు

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలిలా ఉన్నాయి: 1.ఆరిఫ్‌ ఖాన్‌ (23) ఖారెడా గ్రామము, 2. సర్ఫరాజ్‌ (24) బీజ్వాడ నారోక గ్రామము, 3. యం.ఆష్‌ మహ్మద్‌ (29) 4. షాపుస్‌ ఖాన్‌, (33) మోరేడా గ్రామము, 5. షారూఖాన్‌, (33) మోరేడా గ్రామము, 6. అస్లాం ఖాన్‌ (33) మోరేడా గ్రామము, 7. యం.షారుఖాస్‌, (27) మహావకార్డ్‌ గ్రామము, సమీర్‌ ఖాన్‌, ఖారెడా గ్రామము. అరెస్టు చేసిన నిందితులందరు మాల్కిడా తాలుకా, అల్వార్‌ జిల్లా, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మిషన్ లోపాలపై అధ్యయనం.. అమలు

ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్‌ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత వెల్లడించారు. ఎస్‌బీఐ ఏటీయం కేంద్రాల్లో ఏర్పాటు చేసే మిషన్లకు సంబందించి perto కంపెనీ చెందిన ఏటీఎం మిషన్‌లో వున్న లోపాలను ఈ ముఠా సభ్యులు పరిచయస్తుడి ద్వారా అధ్యయనం చేసి ఈ ఏటీఎం మిషన్‌ తెరుచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారు. ఈ ముఠా ముందుగా perto కంపెనీ చెందిన ఏటీఎం మిషన్‌ వున్న కేంద్రంలోకి చొరబడి తమ వద్ద వున్న నకిలీ తాళంతో మిషన్‌ ముందు భాగంలో తెరిచి డబ్బులు బయటకు వచ్చే మార్గంలో ఎవరూ గుర్తుపట్టని విధంగా ఓ ఇనుప ప్లేటును గమ్ పెట్టి అమర్చేవారు. ఈ విధంగా అమర్చడం ద్వారా బ్యాంక్‌ ఖాతాదారులు డబ్బు ఏటీయంలో డ్రా చేసుకునే సమయంలో డబ్బు డ్రా అయ్యే మార్గంలో ముఠా ఏర్పాటు చేసిన ఇనుప ప్లేటు కారణంగా ఏటీయం మిషన్‌ నుంచి రావల్సిన డబ్బు బయటకు రాకుండా మిషన్‌ లోపలే నిలిపోతాయి. ఏటీయం మిషన్‌ నుండి డబ్బు బయటికి రాకపోవడంతో బ్యాంక్‌ ఖాతాదారుడు మిషన్‌ సమస్యగా భావించి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఈ ముఠా వెళ్ళి తమ వద్ద వున్న తాళంతో ఏటీఎం తెరచి అందులో నిలిచిపోయిన డబ్బును చోరీ చేసేది. ఆ తరువాత ఖాతాదారుడుకి ఏటీయం సెంటర్‌ నుండి నగదు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు మేసెజ్‌ వచ్చేది. ఆ తరువాత ఖాతాదారులు బ్యాంకుకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఈ విధంగా నిందితులు రాజస్థాన్‌ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ తరహా చోరీలపై బ్యాంక్‌ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో బ్యాంక్‌ అధికారులు perto కంపెనీకి చెందిన పాత ఏటీయం మిషన్‌ స్థానంలో నూతన ఏటీయంలను ఏర్పాటు చేశారు.

ఇతర రాష్ట్రాల పై ఫోకస్

ఈ ముఠా చోరీలు చేసేందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఈ ముఠా సభ్యులు ఈ తరహా ఏటీఎం మిషన్లు వున్న తమిళనాడు, కర్ణాటక, అంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌, పంచిమ బెంగాల్ , కేరళ రాష్ట్రాల్లో మొత్తం 40కి పైగా చోరీలకు పాల్పడ్డారు.

ఎట్టకేలకు వరంగల్లో చిక్కారు

ఈ తరహా చోరీలు చేసేందుకు వరంగల్‌ ట్రై సిటికి రెండు కార్లలో చేరుకున్న ఈ ముఠా.. ముందుగా నగరంలో perto ఏటీఎం మిషన్లు వున్న కేంద్రాలు గుర్తించి గత నవంబర్‌ నుండి ఇప్పటి వరకు 7 కేంద్రాల్లో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 12లక్షల 10వేల రూపాయల చోరీ చేశారు. ఇందులో సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడగా, కాజీపేట, హన్మకొండ, మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీకి పాల్పడ్డారు. నగదు పోయిన విషయం ఖాతాదారు సంబంధిత బ్యాంకు లలో ఫిర్యాదు చేయగా , బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఎటిఎం సెక్యూరిటీ మరియు మెయింటెనెన్స్ చేసే సంస్ధ అయిన FSS LTD (ఫైనాన్సియల్ సాఫ్ట్ వెర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ )వాళ్లకు సమాచారం ఇవ్వగా వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదులు చేయగా అమ్రత్తమైన పోలీసులు, పర్యవేక్షణలో క్రైమ్స్‌ అదనపు డీసీపీ బాలస్వామి, క్రైమ్, కాజిపేట్ ఏసిపిలు సదయ్య, ప్రశాంత్‌ రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీని వినియోగించుకున్న పోలీసులు నిందితులను గుర్తించి వారిపై నిఘా పెట్టారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలో అరెస్టు చేశారు. ఈ ముఠాను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌, కాజీపేట్‌ ఇన్స్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, ఏఏఓ సల్మాన్‌ పాషా, కాజీపేట ఎస్‌.ఐలు నవీన్‌కుమార్‌,లవణ్‌ కుమార్‌, సిసిఎస్‌ ఎస్‌.ఐ శ్రీనివాస్‌ రాజు, హెడ్‌ కానిస్టేబుళ్ళు మహేశ్వర్‌, శ్రీనివాస్ కానిస్టేబుళ్ళు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్‌ లను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించి రివార్డులను అందజేశారు.

Read Also |

Bhupalpally : విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ ..వీడియో వైరల్
Beerla Ilaiah : పదవి..జీతం కోసం కేసీఆర్ సభకు వచ్చి వెళ్లాడు : బీర్ల ఐలయ్య
California Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి