తుపాకీతో బెదిరించి పెట్రోల్ బంక్ దోపిడీ

- ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఘటన
- సీసీటీవీలో రికార్డయిన దోపిడీ దృశ్యాలు
విధాత: ముసుగు ధరించిన ఆరుగురు అగంతకులు తుపాకీతో బెదిరించి పెట్రోల్ బంక్‌ను దోచుకున్నారు. ఢిల్లీలోని ముండ్కా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘెవ్రా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ దోపిడీ చోటుచేసుకున్నది. ఈ దోపిడీ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. రెండు బైకుల మీద ఆరుగురు యువకులు ముసుగులు ధరించి ఘెవ్రా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌కు వచ్చారు. చుట్టుపక్కల ఎవరూ లేని గ్రహించి బ్యాగ్‌లో నుంచి ఒకడు తుపాకీ తీసి పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించాడు. ఒకరి కణతపై తుపాకీ పెట్టి డబ్బులు ఇవ్వాలని హెచ్చరించాడు.
పెట్రోల్ పంప్ సిబ్బందిలో ఒకరిపై పిస్టల్‌తో దాడి చేశాడు. రూ.10,000 దోచుకున్నాడు. ఈ క్రమంలో అడ్డుకొనేందుకు ప్రయత్నించిన సిబ్బంది వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి క్షణాల్లో బైకులపై పారిపోయారు. అయితే, ముష్కరులు వచ్చిన బైకులకు ఎలాంటి నంబర్ ప్లేట్లు లేవు. ఈ దోపిడీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దోపిడీ ఫుటేజీని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.