Sanga Reddy: కన్న కొడుకే యముడు.. తల్లిని కిరాతకంగా చంపి
విధాత: నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లి పాలిట యముడిలా మారాడు. ఇలాంటి కొడుకునా కని పెంచింది అని ఆ తల్లే అనుకునేలా రాక్షసత్వం ప్రదర్శించి కన్న తల్లిని కడతేర్చాడు. మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతూ కుటుంబానికి భారం అయినా.. అన్నీ భరిస్తూ పోషిస్తూ వస్తున్న తల్లిని కిరాతకంగా పొడిచి చంపడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్ లో జరిగింది ఈ దారుణ ఘటన తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు. మొత్తం ఆస్తిని తన పేరుపై రాయాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ ఘర్షణకు దిగి తాగిన మత్తులోనే కన్న తల్లిని చంపేశాడు. కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిటిజన్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా రక్త స్రావం జరగడంతో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది.

మద్యానికి బానిసై ఆస్తికోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతూ ఉండేవాడని, సోమవారం (మార్చి3) ఉదయం ఈ..దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram