Delhi Red Fort : ఎర్రకోటలో దొంగలు పడ్డారు..విలువైన జైన కలశాల చోరీ

ఢిల్లీ ఎర్రకోటలో భద్రతా లోపంతో జైన పూజలో వినియోగించిన బంగారం, వజ్రాలతో పొదిగిన విలువైన కలశాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

Delhi Red Fort : ఎర్రకోటలో దొంగలు పడ్డారు..విలువైన జైన కలశాల చోరీ

న్యూఢిల్లీ: పటిష్టమైన బందోబస్తు కొనసాగే ఢిల్లీ ఎర్రకోటలో(Delhi Red Fort) దొంగలు పడ్డారు. ఎర్రకోట పార్కులో జైన మత పూజా కార్యక్రమాల్లో వినియోగించిన విలువైన రెండు కలశాలను దొంగలు ఎత్తుకెళ్లారు. 760గ్రాముల బంగారం..150గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి తయారు చేసిన విలువైన కలశంతో పాటు 115గ్రాముల మరో చిన్న కలశాల దొంగతనం జరిగింది. ప్రముఖ వ్యాపారి వేత్త సుధీర్ జైన్(Sudhir Jain) ఆగస్టు 15నుంచి సెప్టెంబర్ 9వరకు జరిగే జైన మత కలశ పూజా కార్యక్రమంలో వినియోగించారు. పూజా కార్యక్రమం తర్వాత విలువైన ఈ కలశం కనిపించలేదు. దీనిని ఎవరో దొంగిలించారని గుర్తించి సుధీర్ జైన్(Sudhir Jain) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఓ వ్యక్తి రెండు కలశాలను ఓ సంచిలో వేసుకుని భద్రతా సిబ్బంది కళ్లు గప్పి బయటకు వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అతడిపై గతంలోనూ ఆలయాలలో చోరీ అభియోగాలున్నాయని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ చోరీ జరిగిందన్న విమర్శలు వినవస్తున్నాయి. పక్కాగా పథకం మేరకు దుండగుడు విలువైన కలశాలను ఎత్తుకెళ్లాడని భావిస్తున్నారు. చోరీకి గురైన కలశాల విలువ కోటీ రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా కూడా భద్రతా వైఫల్యం డొల్లతనం బయడపడటం కలకలం రేపింది. మాక్ డ్రిల్ లో స్పెషల్ పోలీసులు సాధారణ దుస్తులలో ఓ నకిలీ బాంబుతో ఎర్రకోటలోకి వెళ్లారు. తనిఖీల్లో బాంబును గుర్తించకపోవడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా ఎర్రకోట(Red Fort) భద్రతా వ్యవస్థలో మార్పు రాలేదని..తాజాగా జైన కలశ చోరీ ఘటనతో మరోసారి తేటతెల్లమైంది.