crime in madhya pradesh । పిక్నిక్ స్పాట్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. ఒక స్నేహితురాలిపై రేప్
తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్‌కు వెళ్లిన ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వారి స్నేహితురాళ్లలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో చోటు చేసుకున్నది.

crime in madhya pradesh । మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరు యవ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా మహు మండలేశ్వర్ ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్లారు. ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారి స్నేహితురాళ్లలో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 23, 24 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆర్మీ అధికారులు మహు కంటోన్మెంట్ టౌన్‌లోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో యంగ్ ఆఫీసర్స్ (వైవో) కోర్సు చేస్తున్నారని బడ్‌గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ చెప్పారు. మంగళవారం తమ ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్‌కు వెళ్లారని ఆయన తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆరేడు మంది వ్యక్తులు మహు మండలేశ్వర్ రోడ్డుపై పిక్నిక్ స్పాట్ వద్దకు వచ్చి, కారులో కూర్చొన్న ఆర్మీ అధికారి, అతడి స్నేహితురాలిని చితకబాదారు. మరో అధికారి, అతని స్నేహితురాలు కొండపైన ఉన్నారు.
ఏదో గొడవ జరుగుతున్నదని వారు కిందికి వచ్చారు. ఆ సమయంలో అతడిపైనా దాడి చేసిన దుండగులు.. పది లక్షలు డిమాండ్ చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఒక ఆర్మీ అధికారి తన ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే.. వారు వచ్చేసరికే ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. కారులో జంటపై తుపాకి గురిపెట్టి దాడి చేసిన ఆగంతకులు.. కారులోనే వారిని నిర్బంధించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి గురైన ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లను మహు సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు స్నేహితురాళ్లలో ఒకరిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు గుర్తించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70 (గ్యాంగ్ రేప్), 310 (2) (దోపిడీ), 308 (2) (బలవంతపు డబ్బు వసూళ్లు), 115 (2) (ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం) సెక్షన్ల కింద, ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు అనుమానితులను గుర్తించామని, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని అడిషినల్ ఎస్పీ రూపేశ్ ద్వివేది మీడియాకు తెలిపారు.