12వ తరగతి పరీక్షలలతో తమ విజయాన్ని పురస్కరించుకుని, ఓ పబ్‌లో తన స్నేహితులతో కలసి మద్యం సేవించిన ఓ 17 యేళ్ల టీనేజర్, అర్థరాత్రి 2.15 గంటలకు తన తండ్రి పోర్షే(Porsche Car) కారుతో విపరీతమైన వేగం(200 Kmph)తో నడుపుతూ, కళ్యాణీనగర్ ప్రాంతంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టి, వారి మరణానికి కారణమయ్యాడు. చనిపోయిన వారిని అనీశ్ అవధియా(Anish Awadhia)(24), అశ్వినీ కోస్తా(Ashwini Costa)(25)గా గుర్తించారు.
ఈ నేరానికి శిక్షగా టీనేజర్‌కు జువైనల్ జస్టిస్ బోర్డ్ (Juvenile Justice Board) కొన్ని షరతులపై బెయిల్ మంజూరు చేసింది. జువైనల్ బోర్డు విధించిన షరతులేంటంటే, ప్రమాదం గురించి 300 పదాలకు మించకుండా ఒక వ్యాసం(Essay with 300 words) రాయడం, ఎరవాడ ట్రాఫిక్ పోలీసులతో కలిసి 15 రోజులు పనిచేయడం, మద్యపానం మానేసేందుకు డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం, మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్ తీసుకోవడం…..ఆ సంఘటన, ఈ తీర్పుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదేం చోద్యమంటూ ముక్కునవేలేసుకునేట్లుందని నెటిజన్లు జువైనల్ బోర్డుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పుణె పోలీసులు, అబ్బాయి తండ్రిని అరెస్ట్ చేసి, తనకు మద్యం సరఫరా చేసిన పబ్(Cosie Pub)ను సీల్ చేసారు. మహరాష్ట్రలో మద్యం సేవించే కనిష్ట వయసు 25 సంవత్సరాలు. పిల్లాడి తండ్రి పుణేలో బాగా పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, బాగా పలుకుబడి ఉన్న అత్యంత సంపన్నుడు.
ఈ విషయమై పుణె పోలీస్ కమీషనర్ అమితేశ్ కుమార్(Amitesh Kumar) మాట్లాడుతూ, ఆ అబ్బాయి నిందాపూర్వక హత్య (Culpable Homicide) చేసినట్లుగా తాము రుజువు చేసి తీరతామని స్పష్టం చేసారు. ఆ టీనేజర్‌కు తన ర్యాష్ డ్రయివింగ్ పర్యవసానాలేంటో బాగా తెలుసని, యాక్సిడెంట్ జరిగితే బాధితులు మరణించే అవకాశముందన్న విచక్షణ కూడా ఉందని తాము రుజువు చేయగలమని కమీషనర్ తెలిపారు. ఆ ప్రకారమే భారత శిక్షా స్మృతి సెక్షన్లను తనపై మోపుతామని ఆయన స్పష్టం చేసారు. ప్రస్తుతానికి తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులను సాక్ష్యాలుగా పరిగణిస్తున్నట్లు, కేసును అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్నట్లు ఆయన అన్నారు. నేర తీవ్రత దృష్ట్యా తాము జువైనల్ బోర్డుని సంప్రదించినప్పటికీ తమ విజ్ఞప్తిని బోర్డు తిరస్కరించిందని, అందుకే తాము జిల్లా కోర్టును ఆశ్రయించామని తెలిపారు. నిర్భయ చట్టం ప్రకారం, నిందితులు 16 ఏళ్లవారైనా చేసిన నేరం ఘోరమైనదైతే మేజర్‌గానే పరిగణించవచ్చని కమీషనర్ అన్నారు. ఆ అబ్బాయికి వ్యతిరేకంగా తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలున్నాయని, అన్ని సీసీటీవీ ఫుటేజ్లలో ఆ అబ్బాయి, అతని ఫ్రెండ్స్ ఉన్నారని కుమార్ తెలిపారు.
మరోవైపు, మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జువైనల్ బోర్డు తీర్పుపై విస్మయం వ్యక్తం చేసారు. ఇదేం శిక్షని, బోర్డు విధించిన తేలికపాటి శిక్షను ఖండించారు. ఈ కేసులో నిందితులను కఠినాతికఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. జువైనల్ బోర్డు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము జిల్లా కోర్టులో అప్పీల్ చేసామని, ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తనకు తెలుసన్నారు. కేసు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటునట్లు ఫడ్నవీస్ తెలిపారు.
ఈ సంఘటనను హత్యగానే చూడాలని, జువెనైల్ బోర్డు ఇచ్చిన విచిత్రమైన తీర్పు తమను షాక్‌కు గురిచేసిందని మరణించిన పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక పుణేలో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. యాక్సిడెంట్ చేసిన కారున్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, దాన్ని ఎడాపెడా కర్రలతో, రాళ్లతో బాదారు. పుణే నెటిజన్లు పనిలో పనిగా అసలు ఈ తీర్పు ఇచ్చిన జువైనల్ బోర్డు జడ్డి ఎవరా అని ఆరా తీస్తున్నారు.