హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విధాత): సికింద్రాబాద్ సమీపంలోని ఒక విలువైన భూమిపై వివాదం మొదలు కాగా, ఈ లడాయి కాస్తాఒక పోలీసు కమిషనర్, అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య నువ్వా నేనా అనే స్థాయికి వెళ్లింది. కనీసం విలువ ఇవ్వకుండా, పరుషంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన సదరు ఎమ్మెల్యే ఆగ్రహానికి లోనై అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (ప్రివిలేజ్ మోషన్) ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ విషయం తెలిసిన మంత్రులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేను నచ్చచెప్పి శాంతపరిచారని సమాచారం. వెంటనే సదరు పోలీసు కమిషనర్ ను పిలిపించి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్ధు మణిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న మంత్రులు కొత్త వివాదం రాజేసుకునే బదులు, చల్లార్చడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో భూ వివాదాలు, తగాదాలు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య గొడవలకు కేంద్రంగా మారుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఒక వర్గం తరఫున, అధికారులు మరొక వర్గం తరఫున వకల్తా పుచ్చుకోవడం మూలంగా అనేక మలుపులు తిరుగుతున్నది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సమీపంలోని ఒక ప్రాంతంలో అత్యంత విలువైన (సుమారు రూ.55 కోట్లు) భూమి గత ఐదారు దశాబ్ధాలుగా ఒక వ్యక్తి ఆధీనంలో ఉంది. ఇదే భూమిపై మరో ముఖ్య నాయకుడికి చెందిన వ్యక్తుల కన్ను పడింది. ఇంకేముంది గొడవ పెరిగి పెద్దది అయ్యింది. ముఖ్య నాయకుడికి మద్ధతు ఇవ్వాల్సిందిగా ఒక పోలీసు కమిషనర్ సంబంధిత డీసీపీని ఆదేశించారని తెలుస్తున్నది. ఆయన రంగంలోకి దిగిదారు. దశాబ్ధాలుగా కబ్జాలో ఉన్న వారిని పిలిపించి మాట్లాడారు. వారు వినకపోవడంతో, మీరు ఏం చేయలేరంటూ తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని లేదంటే స్వాధీనం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఇక చేసేది ఏమీ లేక బయటకు వచ్చిన బాధితులు తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆ ఎమ్మెల్యే భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులతో అధ్యయనం చేయించారు. వారిచ్చిన సూచన మేరకు రంగంలోకి దిగి తన పని మొదలు పెట్టారు. పోలీసు కమిషనర్ ను కలిసి ఈ విషయాన్ని వివరించి, సివిల్ వివాదాల్లో ఎందుకు తల దూర్చుతున్నారంటూ నేరుగా అడిగారట. ‘ఈ విషయంలో మాట్లాడేందుకు నా వద్దకు ఎందుకు వచ్చావు? నాకేం సంబంధం?’ అని కమిషనర్ ఎదురు ప్రశ్నించడంతో గొడవ రాజుకుంది. మీ ఆదేశంతోనే డీసీపీ రంగంలోకి దిగి తమ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగడంతో సదరు ఎమ్మెల్యే అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఏం చేయాలా అని ఆలోచించిన తరువాత అసెంబ్లీలోనే కమిషనర్ సంగతి తెల్చుకోవాలని ఎమ్మెల్యే నిర్ణయించారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పోలీసు కమిషనర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు అవసరమైన కాగితాలతో ఎమ్మెల్యే సిద్ధమయ్యారని తెలిసింది. ఈ విషయం తెలియడంతో మంత్రులు అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు ఎమ్మెల్యేను పిలిపించి మెత్తబరిచారని సమాచారం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడమే కాకుండా, కమిషనర్ ను పిలిపించారని, మంత్రుల సమక్షంలోనే కమిషనర్, ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పించారని చెప్పుకొంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అధికార పార్టీలో వ్యాప్తించింది. ముఖ్య నాయకుడికి చెందిన వర్గం వారి తరఫున కమిషనర్ వకల్తా పుచ్చుకోవడం మూలంగానే, ఎమ్మెల్యే పట్ల పరుషంగా మాట్లాడారని ఒక కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. కబ్జాలో ఉన్న వ్యక్తి, వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నాయకుల వద్దకు వెళ్లడం, గొడవకు దారి తీసిందని అంటున్నారు.