Brahma Kamalam | హైదరాబాద్‌లో అద్భుతం.. ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మకమలాలు.. వీడియో
Brahma Kamalam | ఎక్కడో హిమాలయ పర్వతాల్లో( Himalayas ) వికసించే బ్రహ్మ కమలం( Brahma Kamalam ).. ఇప్పుడు మన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే చెట్టుకు 20 బ్రహ్మ కమలాలు విరబూయడంతో.. వాటిని చూసి తన్మయత్వం చెందారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ పుష్పాలు( Flowers ).. హైదరాబాదీలను ఎంతో ఆకర్షించాయి.

Brahma Kamalam | బ్రహ్మ కమలాలు.. శ్వేత వర్ణంలో ఉండి మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే విరబూసే ఈ బ్రహ్మ కమలాలు( Brahma Kamalam )హైదరాబాద్( Hyderabad ) నగరంలో అద్భుతం సృష్టించాయి. నగరంలోని సాలార్‌జంగ్ కాలనీ( Salar Jung Colony )లో ఓ ఇంట్లో శనివారం రాత్రి బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఒకే చెట్టుకు 20 బ్రహ్మ కమలాలు విరబూయడంతో ఆ ఇంట ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇరుగు పొరుగు వారు కూడా ఆ పుష్పాలను చూసి తన్మయత్వం చెందారు. పలువురు మహిళలు, భక్తులు విరబూసిన బ్రహ్మ కమలాలను తమ కెమెరాల్లో బంధించారు.
రెండు నెలల వ్యవధిలోనే..
అయితే ప్రతి ఏడాది ఈ పుష్పాలు జూన్ మాసంలోనే పూస్తాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా కొంచెం ఆలస్యంగా పూస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు మాసంలో ఇదే సాలార్‌జంగ్ కాలనీలో ఇదే చెట్టుకు 24 బ్రహ్మ కమలాలు విరబూశాయి. మళ్లీ అదే చెట్టుకు తాజాగా అంటే రెండు నెలల విరామం తర్వాత ఒకే సారి 20 బ్రహ్మ కమలాలు విరబూసి.. అందర్నీ ఆకర్షింపజేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి ఈ బ్రహ్మ కమలాలు.
కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్( King of Himalayan flower )
బ్రహ్మ కమలం ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సౌసేరియా అబ్‌వల్లట. ఈ మొక్క ఎక్కువగా హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ), బర్మా, టిబెట్, నేపాల్, సౌత్ చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంది. అంతేకాదు బ్రహ్మ కమలానికి ఉత్తరప్రదేశ్ పుష్పంగా పేరుంది. ఇక ఈ బ్రహ్మ కమలాన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు.
ఆకుల నుంచి పుష్పాలు వికసించడం ఈ చెట్టు ప్రత్యేకత
ఈ చెట్టు కేవలం వానా కాలంలోనే విరబూస్తుంది. ఎండాకాలంలో పువ్వులు పుష్పించడం చాలా అరుదు. ఇక దీని ప్రత్యేకత ఏంటంటే.. ఆకుల్ని నాటితే దాన్నుంచే మొక్క ఉద్భవిస్తుంది. వేర్లు అవసరం లేదు. ఆకుల నుంచే పువ్వులు వికసిస్తాయి. చిన్న మొగ్గగా ప్రారంభమై 10 నుంచి 15 రోజుల్లో బ్రహ్మ కమలాలు విరబూస్తాయి. ఈ పుష్పాలు కేవలం రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి.. తెల్లారే సమయానికి బ్రహ్మ కమలాలు మోక్షాన్ని పొందుతాయి. ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈ రకానికి చెందిన చెట్లు పగటి పూట కూడా విరబూస్తున్నాయి.