సిరి సంపదల మార్గాలు..గవ్వలతో ఇన్ని లాభాలా..!

సముద్రంలో లభించే గవ్వలతో ఎన్ని లాభాలో తెలిస్తే..గవ్వలను ఇంట్లో పెట్టుకోక మానరు. హిందూ సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తుంది. అదృష్టం కలిసి రావాలంటే..లక్ష్మీ కటాక్షం సిద్దించాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలని చెబుతుంటారు. నిజంగానే గవ్వలకు అంత శక్తి ఉందా అన్న ఆసక్తి రేకెత్తకమానదు.

సిరి సంపదల మార్గాలు..గవ్వలతో ఇన్ని లాభాలా..!

విధాత : సముద్రంలో లభించే గవ్వలతో ఎన్ని లాభాలో తెలిస్తే..గవ్వలను ఇంట్లో పెట్టుకోక మానరు. హిందూ సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తుంది. అదృష్టం కలిసి రావాలంటే..లక్ష్మీ కటాక్షం సిద్దించాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలని చెబుతుంటారు. నిజంగానే గవ్వలకు అంత శక్తి ఉందా అన్న ఆసక్తి రేకెత్తకమానదు. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తుంటారు. గవ్వలను లక్ష్మీ దేవి సోదరిగానూ.. శంఖాలను సోదరుడుగాను కొలుస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. ఈ క్రమంలోనే సముద్రగర్భంలో లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదేవిధంగా గవ్వలు కూడా సముద్రగర్భం నుంచి ఏర్పడ్డాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరి సోదరులుగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గవ్వలను ఇంట్లో ఉంచుకుంటే.. ధనాన్ని ఆకర్షిస్తాయని చెబుతారు.

సిరి సంపదల వృద్ది కారకాలు

లక్ష్మి కటాక్షం అందించే గవ్వలను డబ్బును నిల్వచేసే చోట, లాకర్లు, వ్యాపారాలు చేసే చోట..గల్లాపెట్టెలలో వీటిని తెచ్చి పెట్టుకుంటారు. ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందనేది కొందరి నమ్మకం. అయితే గవ్వలను కన్నులు ఉన్న ముఖం వైపును డబ్బులకు తగిలేలా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. హిందూ సంప్రదాయంతో పాటు ఫెంగ్ షుయ్ అనే చైనా శాస్త్రంలోనూ గవ్వల శక్తిపై ఆసక్తికర అంశాలు వివరించారు. చైనా ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం..గవ్వలను ఎక్కడ ఉంచితే అక్కడ అదృష్టం వచ్చి చేరుతుందని విశ్వసిస్తారు. పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి. పంచతంత్రం గ్రంథంలో “చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు” అని పేర్కొనడం గమనార్హం. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.

లక్ష్మీ కారక గవ్వలు!

బీచుల్లో అనేక రకాల గవ్వలను విరివిగా అమ్ముతుంటారు. అయితే పసుపు రంగులో ఉండే గవ్వలను అన్నింటిలోనూ శ్రేష్ఠమైనవిగా చెప్తారు. ఇక మార్కెట్లో కొన్ని రకాల ప్లాస్టిక్ గవ్వలు కూడా లభ్యమవుతున్నాయి. వాటిని గుర్తించి దూరం పెట్టాలి. పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాధాన్యత ఉందో.. గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుందన నమ్మకం. అందుకే మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలని చెప్తుంటారు. గవ్వలతో లక్ష్మీదేవికే కాకుండా.. శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అలంకారంగా ఉంటాయి.

గవ్వలతో ఉపయోగాలు

హిందూ సాంప్రదాయంలో గవ్వలను కేవలం సముద్రపు అలంకార వస్తువులు మాత్రమే కాకుండా, అదృష్టం, ధనం, శుభంకు సూచికలుగా భావిస్తారు. కొత్తగా గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా వస్త్రంలో గవ్వలను కడితే శుభప్రదం.అలా చేయటం వలన అవాంతరాలు తొలగిపోయి.. గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టేనని నమ్మతుంటారు. కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు. వ్యాపారులు గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం ద్వారా ధనాభివృద్ధి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయని పెద్దల కథనం.

వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కడుతుంటారు. ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ముఖ్యమైన పనుల కోసం వెళ్లేవారు కూడా గవ్వలను దగ్గర ఉంచుకోవాలని చెప్తుంటారు. గవ్వలతో లాభాల అంశాలను.. విశ్వాసాలు సాంప్రదాయ, ఆధ్యాత్మిక నమ్మకాలపై ఆధారపడినవిగా మాత్రమే పరిగణించాలని శాస్త్రీయ నిపుణులు సూచిస్తున్నారు.