Rohini Karte | సూర్యుడు నెల రోజులకు ఒక రాశి మారడం సహజం. ఆ మాదిరిగానే ప్రతి 13.5 రోజులకు ఒకసారి ఓ నక్షత్రంలో సూర్యుడు సంచరిస్తుంటాడు. అయితే సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరించే ఆ 13 రోజుల సమయాన్ని రోహిణి కార్తె( Rohini Karte )గా పరిగణిస్తారు. రోహిణి కార్తెను తీవ్రమైన ఎండల సమయంగా పరిగణిస్తారు. అందుకే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయ్ అని అంటుంటారు. అంటే ఆ స్థాయిలో మండుటెండలు భగభగమంటాయి. వేడి గాలుల తీవ్రత కొనసాగుతుంది. అందుకే రోహిణి కార్తె సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ రోహిణి కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది..? ఎప్పుడు ముగుస్తుంది..? ఈ సమయం అనుకూలమా..? ప్రతికూలమా..? అనే విషయాలను తెలుసుకుందాం.
రోహిణి కార్తె ఎప్పుడంటే..?
ఈ ఏడాది మే 25న రోహిణి కార్తె ప్రారంభమై.. జూన్ 8న సోమవారంతో ముగుస్తుంది.
రోహిణి కార్తె పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు అనుకూలమా..?
రోహిణి కార్తె సమయంలో పెళ్లిళ్లు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరపకూడదు, ఎందుకంటే అలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సామరస్యం దెబ్బతింటాయి. ఎలాంటి శుభకార్యాలకు కూడా ఈ సమయం అనుకూలం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది.
రోహిణి కార్తె తర్వాత వచ్చేది ఏ కార్తె..?
రోహిణి కార్తె తర్వాత ముఖ్యమైన కార్తెలు మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె వస్తాయి. మృగశిర కార్తె జూన్ 9 నుంచి జూన్ 22 వరకు ఉంటుంది.. ఇది తొలకరి వానలు మొదలయ్యే సమయం ఇది.. రైతులు పంట పండించేందుకు సిద్ధమవుతారు. ఆరుద్ర కార్తె జూన్ 23 నుంచి జూలై 6 వరకు ఉంటుంది.. వర్షాలు ఎక్కువగా కురిసే కార్తె ఇది.. ఆరుద్ర వాన అదను వాన అనే సామెత ఉంది.. వ్యవసాయదారులకు పండుగ లాంటి సమయం ఇది.
