TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? ఈ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు..!

Reported by: Mallanna | ఆధ్యాత్మికం | Apr 09, 2024, 10:23 pm IST
Read Time: 3 mins
TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? ఈ రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు..!

TTD  | ఈ నెల 21 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఏటా మూడురోజుల పాటు వేడుకలను వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నెల 21న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప మాడవీధుల్లో వహరిస్తూ భక్తులను అగ్రహించనున్నారు. వసంతోత్సవ అభిషేకాలు, నివేదికలు పూర్తయ్యాక తిరిగి గర్భాలయంలోకి చేరుకుంటారు. రెండోరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్వర్ణరథంపై భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవ వేడుక జరుపుతారు. 23న ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామివారితో పాటు సీతారామలక్ష్మణులు ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం నిర్వహిస్తారు.

సాయంత్రానికి తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు. వేడుకల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుపుతారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం జరుగుతుంది. వసంత ఋతువులో మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవం’ ఏర్పడింది. క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడంతో పాటు వివిధ ఫలాలను నివేదించనున్నారు. వసంతోత్సవం సందర్భంగా 23న అష్టదళ పాదపద్మారాధన, 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.