Simhachalam | భక్తులతో కిటకిటలాడిన సింహగిరి.. వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ

రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం నిర్వహించే గిరి ప్రదక్షిణకు శనివారం ఉదయం నుంచే భక్తులు పోటేత్తారు

Simhachalam | భక్తులతో కిటకిటలాడిన సింహగిరి.. వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం నిర్వహించే గిరి ప్రదక్షిణకు శనివారం ఉదయం నుంచే భక్తులు పోటేత్తారు. గిరి ప్రదక్షిణ కోసం తరలివచ్చిన భక్తులతో సింహగిరి క్షేత్రం కిటకిటలాడింది. శనివారం సాయంత్రం 4.00 గం.ల‌కు కొండ దిగువ‌న తొలిపావంచా ( కొండ ఎక్కే మొద‌టి మెట్టు) వ‌ద్ద నుంచి పుష్పర‌థం ప్రారంభం కాగా, వేలాది మంది భక్తులు తొలిపావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి, గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. చిరు జల్లులు కురుస్తున్నా ప్రదక్షిణను కొనసాగిస్తున్నారు. సాయంత్రం కల్లా భక్తుల రద్ధీ భారీగా పెరిగింది. గిరి ప్రదక్షిణ మార్గాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని స్మరించుకుంటూ భక్త జనం ముందుకు సాగారు.

జిల్లా యంత్రాంగం, జీవీఎంసి, దేవాదాయ,పోలీస్, వైద్య ఆరోగ్య తదితర శాఖలు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాయి. పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు అల్పాహారాన్ని అందించాయి. తాగునీరు, పారిశుధ్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటుచేసిన జీవీఎంసి అధికారులు ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి భక్తులకు అవసరమైన మందులను పంపిణీ నిర్వహించారు. ఆర్టీసీ సంస్థ సింహాచలం వరకు భక్తులు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడిపించింది. పోలీస్ యంత్రాంగం గిరి ప్రదక్షిణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భక్తుల రాకపోకలను పర్యవేక్షించారు.