2026 Renault Duster | కొత్త అవతారంలో రెనో డస్టర్: హైబ్రిడ్ సాంకేతికత, ఆధునిక సౌకర్యాలతో పునరాగమనం
2026 రెనో డస్టర్ భారత్‌లో ఆవిష్కరణ. హైబ్రిడ్ ఇంజిన్, ADAS భద్రత, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టస్లకు గట్టి పోటీ. ₹21,000తో ప్రీ-బుకింగ్ ప్రారంభం, ధరలు మార్చిలో విడుదల.
2026 Renault Duster With Hybrid and ADAS Launched: Everything You Need to Know
విధాత ఆటో డెస్క్ | హైదరాబాద్:
2026 Renault Duster | భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు మధ్యతరహా ఎస్‌యూవీ విభాగానికి గుర్తింపునిచ్చిన మోడల్ డస్టర్. 2012లో తొలిసారి ప్రవేశించిన ఈ వాహనం, గ్రామీణ రోడ్ల నుంచి హైవేల వరకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచింది. కాలక్రమంలో పోటీ పెరగడంతో డస్టర్ వెనకబడినప్పటికీ, ఇప్పుడు మూడో తరం మోడల్‌గా ఆధునిక హంగులు సంతరించుకుని తిరిగి వచ్చింది. 2026 డస్టర్‌ను రెనో ఇండియా అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త టెక్నాలజీ, హైబ్రిడ్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో హ్యుండయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవాలని రెనో లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 21వేల రూపాయల టోకెన్ మొత్తంతో ప్రీ-బుకింగ్ ప్రారంభమవ్వడం ఈ మోడల్‌పై మార్కెట్‌లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
కొత్త డిజైన్‌తో ఆకట్టుకునే డస్టర్, భారత రోడ్లకు అనుగుణంగా రూపకల్పన

2026 డస్టర్ గ్లోబల్ మోడల్ ఆకృతిని కొనసాగిస్తూనే, భారత్ కోసం ప్రత్యేక మార్పులతో రూపొందింది. ముందు భాగంలో ఐబ్రో స్టైల్ LED డీఆర్‌ఎల్స్‌తో హెడ్‌లైట్లు, ‘డస్టర్’ బ్యాడ్జ్‌తో గ్రిల్, వెండి రంగు హైలైట్స్ ఉన్న బంపర్.. వాహనానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. రెండు వైపులా బ్లాక్ క్లాడింగ్, సీ-పిల్లర్‌పై అమర్చిన డోర్ హ్యాండిల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ రగ్డ్ లుక్‌ను అందిస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్‌తో ఆధునిక పోకడ కనిపిస్తుంది. 212 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతలు, పాడైన రోడ్లు, గ్రామీణ మార్గాల్లోనూ సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించారు. భారతదేశంతో పాటు మూడు ఖండాల్లోని వివిధ రోడ్లపై పరీక్షలు నిర్వహించి ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు రెనో వెల్లడించింది.
హైబ్రిడ్‌తో పాటు టర్బో ఇంజిన్లు, పనితీరు పవర్ఫుల్

కొత్త డస్టర్‌లో విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించారు. ప్రధానంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఈ మోడల్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఈ వ్యవస్థ మొత్తం 160 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 1.4 కిలోవాట్ బ్యాటరీ సహాయంతో నగరాల్లో 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. మరోవైపు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 పీఎస్ శక్తి, 280 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. దీనికి మాన్యువల్ లేదా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 పీఎస్ శక్తితో మాన్యువల్ వెర్షన్‌లో లభిస్తుంది. ఈసారి ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌ను రెనో అందుబాటులోకి తీసుకురాలేదు. టర్బో మోడళ్ల డెలివరీలు మార్చి–ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుండగా, హైబ్రిడ్ మోడళ్లు దీపావళి తర్వాత వినియోగదారులకు అందనున్నాయి.
విలాసవంతమైన ఇంటీరియర్లు, ADAS భద్రతతో నేటి ప్రమాణాలు

డస్టర్ ఇంటీరియర్‌ను పూర్తిగా ఆధునికీకరించారు. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లతో డాష్‌బోర్డ్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, గూగుల్ OS ఇంటిగ్రేషన్ వాహనానికి హైటెక్ అనుభూతిని అందిస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఈ మోడల్‌ను ప్రీమియం సెగ్మెంట్‌కు దగ్గర చేశాయి. 518 లీటర్ల బూట్ స్పేస్ కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉంది. భద్రత విషయంలో ఈసారి రెనో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS, లేన్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లతో ప్రయాణికులకు గరిష్ఠ రక్షణ కల్పిస్తోంది. భారత్‌లో ADAS గుర్తింపు పొందిన తొలి రెనో మోడల్‌గా డస్టర్ నిలిచింది.
అందుబాటులోనే ధరల అంచనా
రూ.21,000 టోకెన్‌తో ప్రీ-బుకింగ్ ప్రారంభమైన ఈ వాహనం ధరలను మార్చి 2026లో ప్రకటించనున్నారు. అంచనా ప్రకారం ధర రూ.9.5 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అదనంగా 7 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు వర్తించే ‘రెనో ఫరెవర్’ వారంటీ ప్యాకేజీని కంపెనీ అందిస్తోంది.
క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారాలతో ఢీ

5 సీట్ల ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే భారీ పోటీ నెలకొంది. ఇప్పుడు డస్టర్ పున:ప్రవేశంతో ఇది మరింత పెరిగే అవకాశముంది. మార్కెట్లో మంచి పట్టుకోసం ప్రయత్నిస్తున్న క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారాల వంటి మోడళ్లకు ఇది నేరుగా గట్టి పోటీగా ఇవ్వనుందని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram