సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. తమ రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన, వార ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేష రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా గొప్ప శుభయోగాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. బుద్ధిబలంతో సమయానుకూలంగా నడుచుకుంటే కార్యసిద్ధి ఉంటుంది. మీ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం సహోద్యోగుల సహకారంతో పనిచేస్తే అన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు వారం ప్రథమార్ధం అనుకూలించక పోయినా ద్వితీయార్ధంలో ఊహించని లాభాలు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు గడప ఎక్కేముందు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వృధా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
మిథునం
మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్నీ రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉన్నప్పటికినీ సహోద్యోగుల సహకారంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువు నుంచి దృష్టి మరల్చవచ్చు. స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండక అశాంతితో ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు గడ్డుకాలం నడుస్తోంది. పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది అందుకే జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్థులకు పనిభారం పెరుగుతుంది. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సమస్యలతో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
సింహం
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగస్థులకు వారం ప్రారంభంలో చాలా అదృష్టం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఉన్నత స్థాయి అధికారులతో పరిచయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంపద పెరుగుతుంది. ఎంతో కాలంగా భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు చేయాలనుకునేవారికి ఈ వారం కల నెరవేరుతుంది. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సహోద్యోగులతో, సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టం వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వివాదాలకు దారి తీయవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.
తుల
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. లక్ష్మీ కటాక్షం ఉంది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగులు చాలా కాలంగా బదిలీ, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వారం చివరలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రేయోభిలాషుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. సోమరితనం కారణంగా గొప్ప అవకాశాలను కోల్పోయే ప్రమాదముంది. బద్దకాన్ని వీడి కష్టించి పనిచేస్తే తప్ప వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉండదు. బంధువులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. అంతర్జాతీయ వ్యాపారంలో వృత్తిని కొనసాగించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. సమిష్టి నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యర్థులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. దైవబలంతో సమస్యను అధిగమిస్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించున్నట్లైతే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్థిక లాభాలను పొందవచ్చు. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి జీతంతో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కుటుంబంలో, సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం
మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమతోనే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. ఇంటి మరమ్మత్తు పనులకు సంబంధించి అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. కుటుంబ ఆస్తి వ్యవహారాలు కోర్టులో కాకుండా చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. సోమరితనం, పనిలో నిర్లక్ష్య వైఖరితో మొదటికే మోసం తెస్తుంది. బద్ధకం వీడితే మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. లేకుంటే భారీ నష్టాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఆస్తి వివాదాల విషయంలో కోర్టుకు వెళ్లడం కంటే, సామరస్యపూర్వక చర్చల ద్వారా పరిష్కరించడం ఉత్తమం. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా లేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు.
మీనం
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వారం ప్రథమార్ధంలో పట్టుదలతో శ్రమించి తమ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు అప్పగించకుండా పూర్తి చేస్తేనే మంచిది. లేదంటే ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు ఈ వారం ప్రథమార్ధం అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారాలలో తెలివిగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదముంది. సంపద గణనీయంగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.