Abhijit Chaudhar | పట్టువదలని విక్రమార్కుడు.. చివరి ప్రయత్నంలో ‘సివిల్స్’ కొట్టేశాడు..
Abhijit Chaudhar | సక్సెస్ ఊరికే రాదు.. ఆ సక్సెస్( Success ) వెనుక ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ కష్టాలను అధిగమించి.. లక్ష్యాన్ని ముద్దాడే వరకు పోరాడే వాళ్లు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. అలా ఓ యువకుడు సివిల్స్( Civils ) సాధించాలనే పట్టుదలతో దాదాపు 11 ఏండ్ల పాటు పుస్తకాలతో( Books ) కుస్తీ చేసి.. చివరి ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు.

Abhijit Chaudhar | యూపీఎస్సీ( UPSC ) నిర్వహించే సివిల్స్( Civils ) పరీక్షల్లో నెగ్గడం అంటే ఆషామాషీ కాదు. సివిల్స్ పరీక్షలకు ఒక పద్ధతి ప్రకారం చదవాలి. ప్రిలిమ్స్( Prelims ), మెయిన్స్( Mains ), ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. కఠోర శ్రమ అవసరం. అంటే రోజుకు కనీసం 10 గంటల పాటు చదివితే కానీ.. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో విజయం సాధించలేం. ఇక ఇంటర్వ్యూ కూడా అనేక మెళకువలు నేర్చుకుని.. యూపీఎస్సీ ముందు అటెండ్ కావాలి. వారు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సరైన, సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినప్పుడే.. ఇంటర్వ్యూలో నెగ్గే అవకాశం ఉంటుంది.
అయితే ఎంత కష్టపడ్డా.. కొందరు ప్రిలిమ్స్ వద్దే ఆగిపోతారు. మరికొందరు మెయిన్స్‌లో విజయం సాధించలేపోతారు. ఇంకొందరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటారు. ఇక తాము సివిల్స్ సాధించలేమనే నిరాశతో మధ్యలోనే వదిలేస్తుంటారు. కానీ కొందరు.. పట్టువదలని విక్రమార్కుడిలా చివరి అవకాశం వరకు పోరాడుతూనే ఉంటారు. అలా చివరి ప్రయత్నంలో ఓ యువకుడు సివిల్స్ సాధించి.. తన కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో ఏండ్ల కల సాకారం కావడంతో అతని తల్లిదండ్రులు, స్నేహితులు సంతోషంలో మునిగిపోయారు.
మహారాష్ట్ర( Maharashtra )లోని బారామతి( Baramati )కి చెందిన అభిజిత్ చౌదర్( Abhijit Chaudhar ).. గత 11 ఏండ్ల నుంచి యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils )కు ప్రిపేరవుతున్నాడు. ఐఏఎస్( IAS ) లేదా ఐపీఎస్( IPS ) కావడం తన కల. అందుకోసం నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాడు. కానీ ప్రతి ఏడాది తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. మెయిన్స్, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.
గతేడాది ఒక్క మార్కుతో..
గతేడాది ఇంటర్వ్యూ దాకా వెళ్లాడు. ఒక్క మార్కు తక్కువ రావడంతో లక్ష్యాన్ని ముద్దాడలేకపోయాడు. అంతటితో ఆగిపోలేదు. నిరాశ పడలేదు. ఇక ఇదే అభిజిత్‌కు చివరి అవకాశం సివిల్స్ రాసేందుకు. మళ్లీ పుస్తకాల పురుగై.. సివిల్స్ పరీక్షలతో యుద్ధం చేశాడు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆలిండియాలో 487 ర్యాంకు సాధించి.. తన కల సాకారం చేసుకున్నాడు. చివరి అవకాశంలో సక్సెస్ కావడంతో.. అభిజిత్ ఆనంద భాష్పాలు రాల్చాడు.
ఇక అభిజిత్ తండ్రి రామ్‌దాస్ చౌదర్ వ్యాపారవేత్త, తల్లి అనురాధ గృహిణి. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మరాఠీ మీడియం స్కూల్‌లో తన విద్యాభ్యాసం కొనసాగించాడు. మాలేగావ్‌లోని శివనగర్ విద్యా ప్రసారక్ మండల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఇది ఎన్నో ఏండ్ల కల..
సివిల్స్ ఫలితాలు విడుదలైన రోజు అభిజిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ఇది ఎన్నో ఏండ్ల కల అని ఆనంద భాష్పాలు రాల్చాడు. 2013 నుంచి పోరాటం చేస్తున్నానని, చివరకు చివరి ప్రయత్నంలో తన కల నెరవేరిందని ఎమోషన్ అయ్యాడు. గతేడాది ఒక్క మార్కుతో సివిల్స్ సాధించలేకపోయానని, ఇప్పుడు ఆలిండియాలో 487 ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నాడు అభిజిత్.
In his last attempt, Abhijit Chaudhar from Pune’s Baramati secures AIR 487 in UPSC; dedicates success to his father pic.twitter.com/d4wnmEKTaW
— Pune First (@Pune_First) April 22, 2025