SSC CGL Notification | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే Combined Graduate Level Examination (SSC CGL) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇవాల్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నట్లు SSC వెల్లడించింది. వీటిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సీబీఐ ఎస్సై, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) తదితర కీలక పోస్టులు ఉన్నాయి. కాగా, ఈ పోస్టులకు దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అర్హతలు
* SSC CGL 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు అదనపు అర్హతలు కూడా అవసరం.
* జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 12వ తరగతి గణితంలో కనీసం 60 శాతం మార్కులు లేదా స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ తప్పనిసరి.
* అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుకు CA, CMA, CS లేదా కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉంటే ప్రాధాన్యమిస్తారు.
వయోపరిమితి
పోస్టుల వారీగా వయోపరిమితి కూడా మారుతుంది. సాధారణంగా చాలా పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. JSO పోస్టులకు గరిష్ట వయసు 32 సంవత్సరాలు కాగా.. ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులకు 27 సంవత్సరాలకు మించరాదు. ఇక రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
SSC CGL ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ముందుగా టైర్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. టైర్-2 పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
టైర్-2 పరీక్షను మెయిన్ పరీక్షగా చెబుతారు. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, పోస్టుల వారీగా ప్రత్యేక పేపర్లు ఉంటాయి. వీటిలో మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. చివరగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
* అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్‌లో లేదా mySSC యాప్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
* ఓటీఆర్ తర్వాత ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుతో ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాలి.
* వ్యక్తిగత, విద్యార్హత, కేటగిరీ, పరీక్షా కేంద్రం వివరాలను నమోదు చేసి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
* తర్వాత UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించి, దరఖాస్తు సమర్పించాలి.
* చివరగా దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి.
దరఖాస్తు సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 1800 309 3063 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని SSC తెలిపింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడాలని సూచించింది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: మే 21, 2026
దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 22, 2026
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు తుది గడువు : జూన్ 23, 2026
దరఖాస్తుల సవరణకు అవకాశం : జూన్ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు
టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష : ఆగస్టు-సెప్టెంబర్ 2026
టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష : డిసెంబర్ 2026
Read More:
ఇండియన్ రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అండర్‌గ్రాడ్యుయేట్స్‌కు నెరవేరని 5 లక్షల వార్షికవేతనం కల.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు
