TGPSC Group 1 Exam | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టులో భారీ ఊరట

గ్రూప్-1 వివాదంపై టీఎస్పీఎస్సీకి హైకోర్టులో ఊరట. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్, 568 నియామకాలు కొనసాగించవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టం.

TGPSC Group 1 Exam | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టులో భారీ ఊరట

విధాత, హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షల వివాదంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ..ర్యాంకుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పిల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. అలాగే ఇప్పటికే 568 అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆదేశాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆక్టోబర్ 16కు వాయిదా వేసింది.

నిబంధనల మేరకే పరీక్షలు : ఏజీ

గ్రూప్‌-1 ఫలితాలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును టీజీపీఎస్సీ అప్పీల్‌ పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారించింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రీ వాల్యుయేషన్‌ సర్వీస్‌ నిబంధనల ఆధారంగా ఉండాలని ఏజీ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయని ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టు దృష్టికి ఏజీ తీసుకువెళ్లారు. ప్రశ్నపత్రాల రీవాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధంగా ఉందన్నారు. కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించిందని.. పరీక్షల నిర్వాహణ రూల్స్ లో రివాల్యుయేషన్ లేదు..రీకౌంటింగ్ మాత్రమే ఉందన్నారు. రీవాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పు నియమాలకు విరుద్దం..కమిషన్ పై చేసిన ఆరోపణలు సహేతుకం కాదని వాదించారు.

సింగిల్ బెంచ్ తీర్పులో సున్నిత అంశాలున్నాయి..

అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ తీర్పును ప్రస్తావిస్తూ టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని పేర్కొంది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని పేర్కొంది. మాల్‌ ప్రాక్టీస్‌, పేపర్‌ లీక్‌ వంటివి ఏమైనా జరిగాయా? అంటూ హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పులో చాలా డెలికేట్‌ పదాలు ఉన్నాయని వివరించింది. బయాస్‌, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని.. బయాస్‌ అంటే ఎవరికైనా ఫేవర్‌ చేశారా? అంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.

విచారణ పర్వం సాగిందిలా..

గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ చేసింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల మొత్తం అందరిని శిక్షించడం సబబు కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీనరసింహ హజరుకాగా.. కమిషన్ తరఫు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. టీజీపీఎస్‌సీ అప్పీల్ దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ విచారణను బుధవారానికి వాయిదా వేసి విచారణ కొనసాగించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 16కు వాయిదా వేసింది.