AP High Court Jobs | ఏపీ హైకోర్టులో కోర్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీ హైకోర్టులో మొత్తం 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా.. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్లకు కోర్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు సంబంధించిన 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 20 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 12 పోస్టులను ట్రాన్సఫర్ ద్వారా భర్తీ చేస్తారు.

ఈ పోస్టుల్లో 13 ఓపెన్ కేటగిరీలో భర్తీ కానున్నాయి. 8 ఈడబ్ల్యూఎస్, బీసీ(A, B, C) లకు తలో ఒకటి, ఎస్సీ విభాగాలకు 3, ఎస్టీలకు 5 పోస్టులు రిజర్వేషన్ కల్పించారు. అదనంగా వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి.

అర్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ(ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 180 పదాల వేగం ఉండాలి. టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 పదాలు/నిమిషం) తప్పనిసరి. కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి

2026 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీతం

నెలకు రూ.57,100 నుంచి 1,47,760

పరీక్షా విధానం

ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్ (150/180wpm) ఆధారంగా 100 మార్కుల పరీక్ష నిర్వహిస్తారు. 180 wpm (3నిమిషాల వ్యవధి), 150wpm (4 నిమిషాల వ్యవధి) వేగంతో డిక్టేషన్ ఇచ్చి, వాటిని కంప్యూటర్లలో ట్రాన్స్‌క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు

ఓసీ/ఈడబ్ల్యూఎస్/బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.400 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు.

దరఖాస్తులు ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆఫ్‌లైన్‌లో అమరావతిలోని ఏపీ హైకోర్టు చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు కావాలని అనుకుంటే సంబంధిత తాజా కుల/ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాలి.

Read More:

AP High Court Jobs | ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. పోస్టును బట్టి జీతం నెలకు రూ.1.47లక్షలు!