AK 47 | టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఒకప్పుడు తన మ్యాజిక్‌తో ఊపేసిన విక్టరీ స్టార్ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ జోడీ… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తోంది.
‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’ (AK 47) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ ఇంటి సెట్‌లో ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
హర్షవర్ధన్ ప్లేస్‌లో తమన్!
ఈ సినిమా గురించి తాజాగా ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ తప్పుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో త్రివిక్రమ్‌కు సన్నిహితుడైన ఎస్.ఎస్. తమన్ బాధ్యతలు స్వీకరించారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి నేషనల్ అవార్డు అందుకున్న హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు తమన్ మ్యూజిక్ మరింత సెట్ అవుతుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్–త్రివిక్రమ్ మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.
క్రేజీ కాంబో రిపీట్
త్రివిక్రమ్–తమన్ కాంబినేషన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌గా మారింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో వీరి జోడీ భారీ విజయాలను అందుకుంది. తర్వాత భీమ్లా నాయక్, గుంటూరు కారం వంటి చిత్రాలతో ఈ బాండింగ్ మరింత బలపడింది.
త్రివిక్రమ్‌ను తన గురువుగా భావించే తమన్… ఆయన సినిమాలకు ఎప్పుడూ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దీంతో ‘AK 47’కు తమన్ ఎలాంటి సంగీతాన్ని అందిస్తారో అనే ఆసక్తి పెరిగింది.
హర్షవర్ధన్ బిజీ షెడ్యూల్
ఇక హర్షవర్ధన్ రమేశ్వర్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ బీజీఎం కంపోజర్‌గా కొనసాగుతున్నారు. ‘జార్జ్ రెడ్డి’, ‘రావణాసుర’ వంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్న ఆయన… ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
మొత్తంగా వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ భారీ సినిమా ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తుండగా, తమన్ ఎంట్రీతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
