Bhanu Priya | భానుప్రియ ఆరోగ్యంపై అనేక రూమార్స్.. అస‌లు విష‌యం చెప్పిన సోదరి శాంతిప్రియ

Bhanu Priya | టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భానుప్రియ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన రేకెత్తించాయి. ఆమె మానసిక స్థితి బాగోలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ రూమర్లపై ఆమె సోదరి, నటి శాంతిప్రియ స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 05, 2026 10:11 AM IST
Bhanu Priya | భానుప్రియ ఆరోగ్యంపై అనేక రూమార్స్.. అస‌లు విష‌యం చెప్పిన సోదరి శాంతిప్రియ

Bhanu Priya | టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భానుప్రియ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన రేకెత్తించాయి. ఆమె మానసిక స్థితి బాగోలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ జరుగుతున్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ రూమర్లపై ఆమె సోదరి, నటి శాంతిప్రియ స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు.

శాంతిప్రియ మాట్లాడుతూ, భానుప్రియ కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నది నిజమే కానీ, ఆమె మతిస్థిమితం కోల్పోయిందనే ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. “అక్కకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో పాత్రల్లో మార్పులు చేయడం, ముందుగా చెప్పినట్లుగా వ్యవహరించకపోవడం ఆమెను చాలా బాధపెడుతోంది. ఇలాంటి పరిణామాలు వరుసగా ఎదురవడంతో ఆమె మానసికంగా కలత చెందుతోంది” అని వివరించారు.

ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు..

సుమారు 280కి పైగా సినిమాల్లో నటించి, అనేక అవార్డులు అందుకున్న భానుప్రియ వంటి సీనియర్ నటి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని శాంతిప్రియ అభిప్రాయపడ్డారు. ఎంత గొప్ప కెరీర్ ఉన్నా కూడా ఇప్పుడు ఆమెను పట్టించుకునే వారు తగ్గిపోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే 80ల స్టార్‌ల రీయూనియన్లకు కూడా ఆమెను ఆహ్వానించడం లేదు. ఇది చాలా బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భానుప్రియ వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదాలు కూడా ఆమెపై ప్రభావం చూపినట్లు శాంతిప్రియ వెల్లడించారు. భర్త మరణం తర్వాత ఆమె ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయిందని, బయట కార్యక్రమాలకు హాజరు కావడం తగ్గిందని తెలిపారు. దీంతో ఒంటరితనం పెరిగి, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పారు.

సినిమాల్లో న‌టించే అవ‌కాశాల‌పై క్లారిటీ..

ఇండస్ట్రీలోని పలువురు ఆమెను సంప్రదించకపోవడం పట్ల కూడా శాంతిప్రియ అసంతృప్తి వ్యక్తం చేశారు. “అక్కను నేరుగా సంప్రదించలేకపోతే, కనీసం మా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు. మా అన్నయ్య ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తే. అయినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు” అని ఆమె అన్నారు.

ఇక భవిష్యత్తులో భానుప్రియ సినిమాల్లో నటించే అవకాశాలపై కూడా శాంతిప్రియ క్లారిటీ ఇచ్చారు. అక్క ఇకపై సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని తెలిపారు. అయితే తాను మాత్రం తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇటీవల విడుదలైన ఒక సినిమాలో తన పాత్రకు భానుప్రియ డబ్బింగ్ చెప్పిన విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై శాంతిప్రియ తీవ్రంగా స్పందిస్తూ, నిర్ధారణ లేకుండా అసత్య వార్తలు ప్రచారం చేయడం మానాలని సూచించారు. “అక్క గురించి తప్పు వార్తలు రాయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి” అంటూ మీడియా, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.