Celebrities Wedding | సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఉదయ్‌పూర్ ఎందుకు ఫస్ట్ ఛాయిస్? … కారణాలు ఇవే

Celebrities Wedding | సినిమా సెలబ్రిటీలైనా, ప్రముఖ వ్యాపారవేత్తలైనా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన వివాహ వేడుకను ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుకుంటారు. అందుకే చాలామంది దేశంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు.

Reported by: Sandeep | సినిమా | Mar 17, 2026, 10:54 am IST
Read Time: 5 mins
Celebrities Wedding | సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఉదయ్‌పూర్ ఎందుకు ఫస్ట్ ఛాయిస్? … కారణాలు ఇవే

Celebrities Wedding | సినిమా సెలబ్రిటీలైనా, ప్రముఖ వ్యాపారవేత్తలైనా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన వివాహ వేడుకను ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుకుంటారు. అందుకే చాలామంది దేశంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు.

ఇటీవలే టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లో జరిగింది. అంతకుముందు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా వివాహం కూడా ఇక్కడే జరిగింది. అంతేకాదు గత కొన్నేళ్లుగా అనేక మంది ప్రముఖులు తమ పెళ్లిళ్ల కోసం ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేసుకోవడం గమనార్హం.

బ‌య‌టివారి నుండి దూరంగా…

ఉదయ్‌పూర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అద్భుతమైన రాజభవనాలు, సరస్సులు, పాతకాలపు రాజసం. పిచోలా సరస్సు మధ్యలో నిర్మించిన తాజ్ లేక్ ప్యాలెస్, సరస్సు ఒడ్డున ఉన్న ది లీలా ప్యాలెస్, ఉదయ్ విలాస్ వంటి విలాసవంతమైన హోటళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్యాలెస్‌ల ఆర్కిటెక్చర్ ప్రతి వివాహ వేడుకను ఒక రాయల్ ఫెయిరీ టేల్‌లా మార్చేస్తుంది. అందుకే సెలబ్రిటీలు తమ పెళ్లిళ్ల కోసం ఇక్కడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

సెలబ్రిటీల వివాహ వేడుకల్లో ప్రైవసీ చాలా ముఖ్యమైన అంశం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్ హోటళ్లు సరస్సులు, కొండల మధ్య ఉండటంతో బయటివారి నుంచి దూరంగా వేడుకలు నిర్వహించడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్ వంటి ప్రదేశాలకు పడవల ద్వారానే చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం కూడా నిర్వాహకులకు సులభమవుతుంది.

సంప్ర‌దాయాల‌కి ప్ర‌తీక‌గా..

ఇక ఉదయ్‌పూర్ కేవలం అందమైన లొకేషన్ మాత్రమే కాదు. అది రాజస్థానీ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుంది. పెళ్లి వేడుకల్లో జరిగే ఘూమర్ నృత్యాలు, ఫోక్ మ్యూజిక్ ప్రదర్శనలు, రాజస్థానీ వంటకాల విందు అతిథులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. ఆధునిక సౌకర్యాలతో పాటు పాతకాలపు రాజసాన్ని కలగలిపి అందించడంలో ఉదయ్‌పూర్ హోటళ్లు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయి.

ఫోటోగ్రఫీ, విజువల్ అందాల విషయంలో కూడా ఉదయ్‌పూర్‌కు సాటి నగరం చాలా అరుదు. సాయంత్రపు సూర్యాస్తమయం సమయంలో సరస్సు నీటిలో ప్రతిబింబించే కోటల వెలుగులు వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలకు అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌ను అందిస్తాయి. అందుకే సెలబ్రిటీల వివాహాల ఆల్బమ్‌లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఈ అన్ని ప్రత్యేకతల కారణంగానే ఉదయ్‌పూర్ ఇప్పుడు సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భవిష్యత్తులో కూడా మరెందరో ప్రముఖుల పెళ్లిళ్లు ఇక్కడే జరిగే అవకాశం ఉందని టూరిజం వర్గాలు చెబుతున్నాయి.