Fahadh Faasil | ఫ్లాప్ డెబ్యూ నుంచి పాన్-ఇండియా స్టార్ వరకు .. ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం ఎలా మలుపు తిరిగింది?

Fahadh Faasil | మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా నిలిచిన ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం నిజంగా ఎంతోమందికి ప్రేర‌ణ‌గా నిలిచింది అనే చెప్పాలి.. ఓ వైపు స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా… మరో వైపు తొలి సినిమాతోనే భారీ వైఫల్యాన్ని చవిచూసి… అక్కడి నుంచి తిరిగి లేచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సాధారణ విషయం కాదు.

Reported by: Sandeep | సినిమా | Apr 22, 2026, 8:52 am IST
Read Time: 5 mins
Fahadh Faasil | ఫ్లాప్ డెబ్యూ నుంచి పాన్-ఇండియా స్టార్ వరకు .. ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం ఎలా మలుపు తిరిగింది?

Fahadh Faasil | మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా నిలిచిన ఫహద్ ఫాసిల్ సినీ ప్రయాణం నిజంగా ఎంతోమందికి ప్రేర‌ణ‌గా నిలిచింది అనే చెప్పాలి.. ఓ వైపు స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా… మరో వైపు తొలి సినిమాతోనే భారీ వైఫల్యాన్ని చవిచూసి… అక్కడి నుంచి తిరిగి లేచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సాధారణ విషయం కాదు.

ఫ్లాప్‌తో ప్రారంభమైన కెరీర్

ఫహద్ ఫాసిల్ 2002లో వచ్చిన కైయేత్తుం దూరత్‌(2002) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఫహద్ నటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వైఫల్యం ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనంతరం ఫహద్ అమెరికాకు వెళ్లి చదువుపై దృష్టి పెట్టారు.

రెండో ఇన్నింగ్స్… కొత్త ఆరంభం

దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఫహద్ 2009లో వచ్చిన కేరళ కేఫేతో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన కాక్‌టెయిల్, చప్పా కురిషు వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.

టర్నింగ్ పాయింట్ – ‘22 ఫిమేల్ కొట్టాయం’

అయితే ఫహద్ కెరీర్‌ను పూర్తిగా మార్చిన సినిమా మాత్రం 22 ఫీమేల్ కొట్ట‌యం అని చెప్పాలి. దర్శకుడు ఆశిక్ అబు తెరకెక్కించిన ఈ థ్రిల్లర్‌లో ఫహద్ ప్రతినాయక పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సిరిల్ సి. మాథ్యూ అనే కపట పాత్రలో ఆయన చూపించిన నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా రిమా కల్లింగల్ నటించారు.

తక్కువ రెమ్యూనరేషన్… భారీ గుర్తింపు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాకు ఫహద్ ఫాసిల్ తీసుకున్న పారితోషికం కేవలం రూ.4 లక్షలే. మొత్తం సినిమా బడ్జెట్ రూ.2.5 కోట్లలో ఇది కేవలం 1.6 శాతం మాత్రమే.

అయితే ఆ సమయంలో ఆయనకు మార్కెట్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ రెమ్యూనరేషన్ స‌రైన‌దేనంటూ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమా ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు తిప్పింది.

నెపోటిజం మధ్య నిలబడిన ప్రతిభ

మలయాళ సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నప్పటికీ… ప్రతిభ లేకపోతే అక్కడ నిలబడటం చాలా కష్టం. ప్రేక్షకులు చాలా క్లారిటీతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఫహద్ తన ప్రతిభతోనే నటుడిగా ఎదిగారు.. ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. వివిధ భాషల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు రూ.4 లక్షలు తీసుకున్న నటుడు… ఇప్పుడు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారని టాక్.

ఫ్లాప్‌తో మొదలైన కెరీర్… కష్టంతో తిరిగి లేచిన విధానం… చివరకు స్టార్‌డమ్‌ అందుకున్న ప్రయాణం ఫహద్ ఫాసిల్ జీవితం నిజంగా ప్రతి యువ నటుడికి ప్రేరణగా నిలుస్తోంది.