Vijay | తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా నటుడు, ఎంపీ కమల్ హాసన్ స్పందిస్తూ గవర్నర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై ఉందని కమల్ హాసన్ పేర్కొన్నారు. టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా జాప్యం చేయడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పుని గౌరవించాలి…
సోషల్ మీడియా వేదికగా స్పందించిన కమల్ హాసన్.. తమిళనాడు చరిత్రలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ అన్ని రాజ్యాంగ వ్యవస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజా తీర్పును గౌరవిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించడం రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని కమల్ కొనియాడారు. ఇప్పుడు అదే బాధ్యత గవర్నర్ కార్యాలయంపైనా ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
కమల్ ఆగ్రహం..
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ 108 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కమల్ అన్నారు.
“మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు.. శాసనసభలోనే నిరూపించుకోవాలి” అని సుప్రీంకోర్టు ఎస్.ఆర్. బొమ్మై కేసులో స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. తాను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదని.. ఒక భారతీయ పౌరుడిగా రాజ్యాంగబద్ధమైన విధానాన్ని గుర్తు చేస్తున్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్
ఇక మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. విజయ్‌కు ప్రజా మద్దతు లభించిందని, సభలో తన మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా ఉందని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ ఇప్పటికే గవర్నర్‌ను కలిసి తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
