Mega Heroes | తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశీల కుటుంబంగా పేరుగాంచిన మెగా ఫ్యామిలీకి 2026 సంవత్సరం అస్సలు కలిసి రావడం లేదు. ఈ ఏడాది వారికి వరుసగా ఆరోగ్య సమస్యలు, గాయాలు చోటు చేసుకోవడం అభిమానుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ వరకు పలువురు ప్రముఖులు చికిత్సలు, సర్జరీలు చేయించుకోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది.
మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆయన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే సినిమా విడుదలైన కొద్దిరోజుల్లోనే ఆయన చేతికి కట్టు వేసుకుని కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అనంతరం ఫిబ్రవరిలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
చరణ్‌కి గాయం..
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ప్రస్తుతం “పెద్ది” చిత్రంలో నటిస్తున్న చరణ్, గ్రామీణ క్రీడాకారుడి పాత్ర కోసం కఠినమైన సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో ఆయన కంటిపై గాయం కావడంతో వైద్య చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అయితే కొద్ది రోజుల్లోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు.
మరోవైపు, హీరో వరుణ్ తేజ్ కూడా గాయంతో ఇబ్బంది పడ్డారు. నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ప్రస్తుతం వాలీబాల్ నేపథ్యంలోని ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్‌కి సర్జరీ..
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఏప్రిల్ 18న ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు వైద్యుల సూచన మేరకు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ కోలుకుంటున్నారు.
ఇలా ఒకే సంవత్సరంలో మెగా కుటుంబానికి చెందిన నలుగురు ప్రముఖులు గాయాలు ,ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి రావడం విశేషంగా మారింది. ఈ పరిణామాలు అభిమానుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. తమ అభిమాన హీరోలు త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ తమ పనుల్లో నిమగ్నం కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
