Priyanka Nalkar | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రియాంక తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పలు టీవీ షోలు, సీరియల్స్, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది.
ప్రేమలో ఎదురైన చేదు అనుభవం
ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక, ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై నమ్మకం లేదని చెప్పింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయని వెల్లడించింది.
“నాకు ఇప్పుడు అబ్బాయిలపై నమ్మకం లేదు. నా జీవితంలో జరిగిన ఒక అనుభవం కారణంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తగ్గిపోయింది. ఒక వ్యక్తి నిజాయితీగా లేడని తెలిసినా, అతనిపై నమ్మకం పెట్టుకుని కొనసాగాను. చివరకు బాధపడింది నేనే. అయితే నన్ను బాధపెట్టిన వారు వారి జీవితంలో తగిన ఫలితాలు అనుభవించారు” అని ప్రియాంక చెప్పింది.
ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి
జీవితంలో ఎదురైన పరిస్థితులు ఒక దశలో తనను తీవ్రంగా కుంగదీశాయని, ఆ సమయంలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని ఆమె తెలిపింది.కొన్ని సందర్భాల్లో జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ల కోసం బతకాలి, వాళ్లను చూసుకోవాలి అనే బాధ్యత నన్ను ఆ నిర్ణయం నుంచి వెనక్కి తీసుకొచ్చింది అంటూ భావోద్వేగానికి గురైంది.
ఒకప్పుడు కలల కుటుంబం కావాలనుకున్నా…
చిన్నప్పటి నుంచి పెళ్లి, కుటుంబ జీవితం గురించి ఎన్నో కలలు కనేదానినని ప్రియాంక తెలిపింది. నాకు చిన్ననాటి నుంచి గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి, పిల్లలతో సంతోషంగా జీవించాలి అనే కలలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం నా దృష్టంతా కుటుంబ బాధ్యతలపైనే ఉంది అని చెప్పింది.
ప్రస్తుతం కుటుంబానికి తానే అండగా నిలుస్తున్నానని, తన తల్లిదండ్రులు, సోదరీమణుల బాధ్యతలను నిర్వర్తించడం తనకు ముఖ్యమని ప్రియాంక వెల్లడించింది. ఇప్పుడు మా ఇంట్లో నేనే సంపాదిస్తున్నాను. మా పెద్ద చెల్లి పెళ్లిని నేనే జరిపించాను. ఇంకా చిన్న చెల్లి పెళ్లి చేయాల్సి ఉంది. మా కుటుంబం కోసం నేను బాధ్యతగా నిలవాలి. అదే నా ప్రాధాన్యం” అని తెలిపింది.
జీవితంలోకి వచ్చే వ్యక్తి అర్థం చేసుకోవాలి
భవిష్యత్తులో ఎవరైనా తన జీవితంలోకి వస్తే కొన్ని విషయాలను గౌరవించాల్సి ఉంటుందని ప్రియాంక స్పష్టం చేసింది.నా జీవితంలోకి ఎవరైనా వస్తే, నా వృత్తిని గౌరవించాలి. నా తల్లిదండ్రులకు నేను అండగా ఉండటం అంగీకరించాలి. ముఖ్యంగా మహిళలను గౌరవించే వ్యక్తి కావాలి. పరస్పర గౌరవం ఉన్నప్పుడే ఏ బంధమైనా బలంగా నిలుస్తుంది అని చెప్పింది.
ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమిస్తూ కుటుంబం కోసం ముందుకు సాగుతున్న ఆమెకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
