అభ్య‌ర్థుల ఎంపిక.. రాహుల్ చేతిలోనే!

అభ్య‌ర్థుల ఎంపిక.. రాహుల్ చేతిలోనే!
  • పైర‌వీల‌కు చెక్‌ -నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు
  • పీఏసీ లిస్టు, స్క్రీనింగ్ క‌మిటీ లిస్టు,
  • స‌ర్వే సంస్థ‌ల లిస్టు ఒక వైపు
  • రాహుల్ ప్ర‌త్యేక లిస్ట్ మ‌రోవైపు
  • అన్ని స‌రిపోలిన నేతలకే టికెట్లు!



విధాత‌, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆచుతూచి అడుగులేస్తున్న‌ది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో చావో రేవో తేల్చుకోవాల‌న్న తీరుగా ఉన్న‌ది. ఈ మేర‌కు స‌ర్వ‌శక్తులు ఒడ్డుతున్న‌ది. తెలంగాణ రాష్ట్రాన్నిఇచ్చిన త‌రువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.


అయితే తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన బీఆరెస్.. కాంగ్రెస్‌ను చావు దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేసింది. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను పార్టీలో క‌లుపుకున్న‌ది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగైన‌ట్లేన‌న్నచ‌ర్చ కూడా ఒక ద‌శ‌లో జ‌రిగింది. ప‌డి లేచిన కెర‌టంలా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్న‌ది.


కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ‌పై కేంద్రీక‌రించింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి అగ్ర‌నేత‌లంతా తెలంగాణలో ప‌ర్య‌టించారు. ధ‌ర‌ణి రద్దు అంశంతోపాటు ఆరు గ్యారెంటీల వ‌ర‌కు ప‌లు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ అన్న అభిప్రాయం సామాన్య ప్ర‌జ‌ల్లో క్రమంగా బలపడుతున్నది.


దీంతో కాంగ్రెస్ పార్టీ అన్ని విష‌యాల‌లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ప‌లు ర‌కాలుగా పరిశీల‌న‌లు చేస్తున్నదని సమాచారం. ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన పార్టీ ఇప్ప‌టికే రెండు మూడు విడత‌లుగా వడ‌పోసింది. స్క్రీనింగ్ క‌మిటీ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ప‌రిశీలించింది. ఢిల్లీలో ప‌లుసార్లు స‌మావేశ‌మైంది.


తాజాగా ఆదివారం మ‌రోసారి స‌మావేశం కానున్న‌ది. ఇలా కింది స్థాయి నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించి, వడ‌పోసిన రెండు మూడు పేర్ల‌తో జాబితాను రూపొందించిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో సునీల్ కనుగోలుతోపాటు ఇత‌ర స‌ర్వేల ద్వారా వ‌చ్చిన జాబితాల‌ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తున్నది.


అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా నియోజ‌క‌వ‌ర్గాలవారీగా ప్ర‌త్యేకంగా స‌ర్వే చేయించి, నివేదిక తెప్పించుకున్నార‌న్న చ‌ర్చ జరుగుతున్నది. స్క్రీనింగ్ క‌మిటీ, ఇత‌ర స‌ర్వే సంస్థ‌లు ఇచ్చే నివేదిక‌ల‌తో పాటు, తాను స్వ‌యంగా తెప్పించుకున్న నివేదిక‌ను ప‌రిశీలించిన తర్వాతే అభ్యర్థులను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.


గెలుపు గుర్రాలకే టికెట్లు


తెలంగాణ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు చెప్పారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు తెలిసింది. ఒక్కోనేత బ్యాక్ గ్రౌండ్ కూడా నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌ స‌మాచారం.


ఈ మేర‌కు రాహుల్ ప్ర‌త్యేకంగా లిస్ట్ త‌యారు చేసుకున్న‌ట్లు తెలిసింది. పార్టీ క‌మిటీలు వ‌డ‌పోసి రూపొందించిన లిస్ట్‌ను, ఈ జాబితాతో స‌రిపోలిన త‌రువాత విడుద‌ల చేయ‌నున్నట్లు పార్టీ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతున్నది.


నేతల సిఫారసులు బుట్టదాఖలు


ఇప్ప‌టికే అభ్య‌ర్థిత్వాల‌పై పలువురు నాయ‌కులు ఇచ్చిన సిఫార‌సుల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో సీనియ‌ర్ లీడ‌ర్ ఒక‌రు త‌న అనుచ‌రుల‌కు 11 మందికి టికెట్లు ఇవ్వాల‌ని అధిష్ఠానం వ‌ద్ద‌కు వెళితే ఇలాంటి జాబితాలతో మ‌రోసారి రావ‌ద్ద‌ని సున్నితంగా హెచ్చ‌రించి పంపిన‌ట్లు స‌మాచారం. మ‌రొక నేత కొంత మంది పేర్లు చెపితే.. అన్నీ తాము చూసుకుంటామ‌ని అన్న‌ట్లు తెలిసింది. దీంతో మిగిలిన నేత‌లు లిస్ట్‌లు తీసుకు వెళ్ల‌డానికి కూడా వెనుకాడిన‌ట్లు స‌మాచారం.


14 తర్వాత అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌


కాంగ్రెస్ పార్టీ ఈ నెల‌ 14 త‌రువాత‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 14 వ‌ర‌కు మంచి రోజులు లేవ‌ని, మంచి ముహూర్తం చూసుకొని జాబితాను విడుద‌ల చేస్తామని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఈ మేర‌కు 8వ తేదీ ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో స్క్రీనింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రుగనున్న‌ది.


ఈ స‌మావేశంలో స్క్రీనింగ్ క‌మిటీ స‌భ్యులు అభ్య‌ర్థుల జాబితాపై చ‌ర్చించి లిస్ట్‌ను ఏఐసీసీకి అప్ప‌గించ‌నున్నారు. ఆ తరువాత 10న ఢిల్లీలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించి, అభ్య‌ర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారని స‌మాచారం.


ఈ స‌మావేశంలోనే బ‌స్సు యాత్ర‌కు సంబంధించి రోడ్డు మ్యాప్‌, భవిష్య‌త్ కార్య‌చ‌ర‌న‌ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌నున్న‌ట్లు పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌చారంలో వేగం పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15 న బ‌స్సు యాత్ర త‌ల‌పెట్ట‌నున్న‌ది. అయితే బ‌స్సు యాత్ర ప్రారంభోత్స‌వానికి కాంగ్రెస్ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ బ‌స్సు యాత్ర‌లో ప్రియాంక ఒక రోజు గ‌డ‌ప‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.


ఈ నెల‌ 18 నుంచి బ‌స్సు యాత్ర‌లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే కూడా బ‌స్సు యాత్ర‌లో పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు ఈ నెల 9 లేదా 10వ తేదీల్లో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ స‌మావేశం నిర్వహించ‌నున్న‌ట్లు స‌మాచారం.